Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనారోగ్యంతో ఉన్న భర్తను చూసేందుకు పెరోల్ పై బయటకు వచ్చిన చిన్నమ్మ శశికళ నిబంధనలు ఉల్లంఘించారనే ప్రచారం జరుగుతోంది. చెన్నై టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని మేనకోడలు నివాసంలో బస చేసిన శశికళ ప్రస్తుతం ఆ ఇంటిని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెరోల్ గడువు ముగిసి జైలుకెళ్లిన తర్వాత అక్కడి నుంచే చక్రం తిప్పడానికి మేనకోడలు నివాసంలో సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మేనకోడలు ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లి రోజూ భర్త నటరాజన్ ను పరామర్శించి వస్తున్న శశికళ మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దినకరన్, ఆయన తమ్ముడు భాస్కరన్, మద్దతు ఎంపీలు ఇద్దరు, అనర్హత వేటుకు గురైన ఓ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో ఆస్పత్రిలో శశికళ భేటీ అయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీకి కూడా శశికళ ప్రయత్నిస్తున్నారని, తన మేనల్లుడు జై ఆనంద్ ద్వారా రాజకీయ వ్యవహారాలు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై దినకరన్ వర్గం అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ ను ప్రశ్నించినప్పుడు ఆయన వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
నిబంధనల ప్రకారం శశికళ ఎవరినీ కలవకూడదని, అయితే ఆమెను ఎవరైనా కలవవచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత రోజు భర్తను కలవడానికి వెళ్లేటప్పుడు పెరోల్ నిబంధనలకు విరుద్ధంగా శశికళ వాహనం వెనక ఏడు వాహనాలు ఉన్నాయి. మూడు వాహనాలకు మాత్రమే జైళ్ల శాఖ అనుమతినిచ్చింది. పోలీసు ఆంక్షలు బేఖాతరు చేస్తూ సుమారు 1000మంది మద్దతుదారులు ఆస్పత్రిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు మఫ్టీలో శశికళ, ఆమె మద్దతుదారుల కదలికలపై నిఘా ఉంచినట్టు తెలుస్తోంది.