Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ అరుముగస్వామి నేతృత్వంలోని విచారణ కమిషన్ ఎదుట శశికళ వాంగ్మూలం ఇచ్చారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు ఏం జరిగిందో వివరించారు. 2016 సెప్టెంబర్ 22న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జయలలిత బ్రష్ చేసుకునేందుకు బాత్ రూం కు వెళ్లి కిందపడిపోయారని శశికళ చెప్పారు. అప్పటికే ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఆ జ్వరంలోనే బాత్ రూంకు వెళ్లి కిందపడిపోవడంతో సాయం పట్టమని తనను పిలిచారని, తాను వెంటనే వెళ్లి ఆమెను బాత్ రూం నుంచి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టానని, అంతలోనే ఆమె స్పృహ కోల్పోయారని శశికళ తెలిపారు. వెంటనే తాను తమ బంధువైన డాక్టర్ శివకుమార్ కు ఫోన్ చేయగా… ఆయన వచ్చి జయలలితను పరీక్షించారని, ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారని తెలిపారు.
ఆ రోజు ఉదయమే డాక్టర్ శివకుమార్ జయలలితను రెండు సార్లు పరీక్షించారని, ఆస్పత్రికి రావాలని చెప్పినా అందుకు జయ ఒప్పుకోలేదని, రాత్రి వేళ ఆమె స్పృహకోల్పోవడంతో శివకుమార్ సూచనమేరకు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించామని చెప్పారు. అపోలో ఆస్పత్రి వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి భర్త విజయ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరానన్నారు. 15 నిమిషాల్లో రెండు అంబులెన్స్ లు వచ్చాయని, ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్యమధ్యంలో జయలలితకు స్పృహ వచ్చిందని, ఎక్కడకు వెళ్తున్నామని అడిగితే ఆస్పత్రికి అని బదులిచ్చానని శశికళ తెలిపారు. అక్రమాస్తుల కేసు వ్యవహారం వల్ల జయ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించిందని, 2016 సెప్టెంబర్ మొదటివారంలో ఆమెకు షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోవడంతో వైద్యులు చికిత్స చేశారని, ఆ తర్వాత కోలుకున్నప్పటికీ… సెప్టెంబర్ 19న మళ్లీ జ్వరం వచ్చిందని శశికళ తెలిపారు.
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదని వచ్చిన వార్తలు అవాస్తవమని విచారణ కమిషన్ ఎదుట శశికళ వ్యాఖ్యానించారు. 2016 అక్టోబర్ 22న అప్పటి తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు జయలలితను చూశారని, అప్పడు ఆమె గవర్నర్ ను చూసి చేయి పైకెత్తిందని, ఈ విషయాన్ని గవర్నరే తనతో చెప్పారని శశికళ వెల్లడించారు. జయలలితను ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత సెప్టెంబర్ 22-27 మధ్య అన్నాడీఎంకె నేతలు పన్నీర్ సెల్వం, తంబిదురై, విజయ్ భాస్కర్ ఆమెను చూశారని తెలిపారు. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు నాలుగు వీడియోలు రికార్డ్ చేశామని, అవన్నీ ఆమె అనుమతితోనే తీశామని శశికళ చెప్పారు. ఆ నాలుగు వీడియోలను విచారణ కమిషన్ కు సమర్పించామని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న జయలలిత అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయారని ఆమెకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించినప్పటికీ… అమ్మ మరణం వెనక కుట్ర ఉందని కొందరు అన్నాడీఎంకె నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయస్థానం విచారణ కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఎదుట అన్నాడీఎంకె నేతలు, జయలలితకు వైద్యం అందించిన డాక్టర్లు వాంగ్మూలం ఇస్తున్నారు. తాజాగా శశికళను కమిషన్ విచారించింది.