అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. దాదాపు నాలుగు నెలలుగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి అయ్యిందని కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌లో రూపొందుతున్న చిత్రం అవ్వడంతో సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమా వాయిదాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే నాగచైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రం పూర్తి అవ్వడం, ఆ సినిమా విడుదలకు రెడీ అవ్వడం జరిగింది. దాంతో శైలజ రెడ్డి అల్లుడు కోసం సవ్యసాచి చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఈసారి చిత్రాన్ని షూటింగ్ పూర్తి కాలేదు అంటూ ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పటి వరకు సినిమా పూర్తి అయ్యింది, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు మళ్లీ ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం, త్వరలోనే తుది షెడ్యూల్ పూర్తి అవ్వబోతుందని చెప్పడం అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది. నాగచైతన్యపై తీసిన కొన్ని ముఖ్యమైన సీన్స్ సరిగా రాలేదని, అందుకే ఆ సీన్స్‌ను రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు చందు మొండేటి మరియు నిర్మాతలు సినిమాను వాయిదా వేశారని సినీ వర్గాల వారు అంటున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రేమమ్ చిత్రంతో మెప్పించిన నాగచైతన్య, చందు మొండేటి జంట ఈ చిత్రంతో కూడా సక్సెస్‌ను దక్కించుకుంటుందని మొన్నటి వరకు అంతా భావించారు. కాని ఇప్పుడు రీ షూట్‌కు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడో అనుమానం కొడుతోంది.