ఈవీఎం హ్యాకింగ్ గుట్టు రట్టు చేసి బీజేపీ సర్కార్ మీద అనుమానం వచ్చేలా చేసిన సయ్యద్ సుజా మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌లో తమపై కాల్పులు జరిపారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని అక్కడే ఉన్న కిషన్ రెడ్డి మమ్మల్ని చంపేయమంటూ గన్‌మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్ రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సయ్యద్ సుజా వెల్లడించారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజి దగ్గర కాకిరెడ్డి గెస్ట్‌హౌస్ ఉందని సయ్యద్ సుజా తెలిపారు. విన్ సొల్యూషన్స్ ద్వారా ఈసీఐఎల్‌కు టెక్నికల్ సహకారం అందించామని విన్ సొల్యూషన్స్‌లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందని ఆయన అన్నారు. అమెరికాలో తనను మనీష్ సిసోడియా, అర్ణబ్ గోస్వామి, వంశీ రెడ్డి కలిశారని, ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా వంశీరెడ్డి కలిశారని సుజా చెప్పారు.
వీవీప్యాట్ లో బగ్ ఫిట్ చేయమని తనను వంశీరెడ్డి అడిగారని ఆ తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జేఎన్‌టీయూలో తాను ఆర్‌ఎఫ్ ఇంజినీరింగ్ చేశానని, షాదాన్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశానని సయ్యద్ సుజా పేర్కొన్నారు. అయితే ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ ఆరోపణల మీద కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ కిషన్‌బాగ్ లో 2014లో తాను మతకలహాలు రెచ్చగొట్టి, 11 మందిని తుపాకీతో కాల్చి చంపినట్లు సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు చేసిన ఆరోపణలను కిషన్ రెడ్డి కొట్టిపడేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, తాను ఎలా నేరానికి పాల్పడతానని ప్రశ్నించారు. షుజా వ్యవహారంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.