జగన్ ఆ ఎమ్మెల్యేని కొన్నారా…?

MLA Meda Mallikarjuna Reddy Tongue Slip On YS Jagan

తాజాగా తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ ఎమ్మెల్యే చేరారు. ప్రతిపక్ష పార్టీల్లోకి ఎమ్మెల్యేలు సహజంగా ఎన్నికల ముందే చేరుతూంటారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించిన పార్టీలో మళ్లీ తనకు చాన్స్ రాదనుకోవడమో లేకపోతే ఈ పార్టీలో ఉంటె మరో ఐదేళ్లకు వచ్చే అవకాశం పక్క పార్టీలోకి వెళితే వెంటనే వస్తుందని ఆశించడమో కానీ ఎన్నికల ముందు ఇలా పార్టీలు మారుతూ ఉంటారు. ఈ కోవలోనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆయన నిన్నామొన్నటి దాకా చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి అడిగినన్ని నిధులిచ్చారని చెప్పేవారు. ఇప్పుడు తాను తులసి వనంలోకి వచ్చాననే మాటలు చెబుతున్నారు. అయితే మరి పార్టీ ఫిరాయింపులపై జగన్ తను మాట్లాడిన మాటలను ఇప్పుడు నెటిజన్ లు ఆయనకు గుర్తు చేస్తున్నారు.

జగన్ వ్యవహారశైలితోనో లేక ఇప్పుడు అధికారాన్ని అనుభవిద్దామనే ఆశతోనో కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు చోటు చేసుకున్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు చేరారు. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే మరో 20 మంది వచ్చేవాళ్లని టీడీపీ నేతలే చెబుతూ ఉంటారు. ఈ చేరికలన్నింటినీ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన మీడియా కూడా చాలా ఘాటుగా విమర్శిస్తూ ఉంటుంది. వారు అమ్ముడు పోయారని కోట్ల రూపాయల విమర్శలు చేస్తూ ఉంటారు. సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొన్నారని జగన్ కూడా చెబుతూ ఉంటారు. అదే జగన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకున్నారు. ఆయనతో రాజీనామా చేయిస్తామని ఇంకోటని చెప్పుకోవచ్చు. అయినా ఆయన్ని కూడా సంతలో పశువుని కొన్నట్లు జగన్ కొన్నారా..?. ఆ ఎమ్మెల్యే అమ్ముడుపోయారా..? అనే ప్రశ్నలు జగన్ కు గట్టిగానే వినిపిస్తున్నాయి.