Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆధ్యాత్మిక రాజకీయం అంటూ కొత్త పద ప్రయోగం అయితే చేసాడు గానీ దాని అర్ధం , ఉద్దేశం ఏంటో రజని చెప్పలేదు అనుకునేంతలోనే ఆయన క్లారిటీ ఇచ్చేసారు. అభిమానులతో మాట్లాడేటప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం అంటే ఏంటో చెప్పిన రజని, జర్నలిస్టులతో సమావేశం అయినప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చారు. నిజాయితీ, లౌకిక భావాలతో కూడినదే ఆధ్యాత్మిక రాజకీయం అంటూ రజని చెప్పారు. అయితే రజని వాడిన “ఆధ్యాత్మిక రాజకీయం “ అనే మాటకు, అందుకోసం ఆయన ఇచ్చిన వివరణకు మిస్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తోంది.
రజని పదప్రయోగం బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉందన్న విమర్శలు రావడంతో ఆయన వేరే విధంగా వివరణ ఇచ్చి ఉంటారని అనిపిస్తోంది. అందుకే హిమాలయాల్లో వందల ఏళ్లుగా బతికి వున్నారని భావించే మహావతార్ బాబా ని నమ్మే రజని ఆయన చెప్పిన క్రియ యోగాలోని ఆపాన ముద్రని పార్టీ సింబల్ గా అనుకుంటున్నారన్న వార్త బయటికి వచ్చింది. అయితే ఆపాన ముద్ర వెనుక తామర పుష్పం గుర్తు కూడా తొలుత ఉంచారు. అయితే బీజేపీ కి అనుకూలం అనే ముద్ర పడుతోందని భావించి ఆ తామర పుష్పాన్ని ఆపాన ముద్ర వెనుక లేకుండా తొలగించారు.
తమిళులు బీజేపీ అంటే మండిపడుతున్నారు అనే విషయాన్ని గమనించే రజని తనపై ఆ ముద్ర పడకుండా కొన్ని మార్పులు చేసుకున్నారు. నిజానికి రజని తన పార్టీ సింబల్ ఆపాన ముద్ర వెనుక తామర పుష్పం ఉంచడానికి వేరే కారణం వుంది. భారతీయ ఋషులు చెప్పినట్టు మనిషిలోని శక్తి కేంద్రాలు ఏడు చక్రాలు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహట, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార…వీటిలో ఆధ్యాత్మిక భావాలకు , పరిణితికి సంకేతం సహస్రార. ఇది వేయి రెక్కలున్న తామర పుష్పాన్ని పోలి ఉంటుంది. అందుకే ఆపాన ముద్ర వెనుక తామర ని ఉంచాలని రజని ముందు అనుకున్నారు. ఇక రజని పార్టీ సింబల్ అనుకుంటున్న ఆపాన ముద్ర ని ఎంచుకోడానికి కూడా ఓ కారణం వుంది. మధ్య వేలు, ఉంగరం వేలు ని మడిచి బొటన వేలు కింద నొక్కి ఉంచి, చూపుడు వేలు , చిటికెన వేలు పైకి లేపి ఉంచడమే ఆపాన ముద్ర.
ఈ ముద్ర మనిషిలోని కల్మషాన్ని భౌతికంగా, శారీరకంగా తొలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పిత్త,అగ్ని సంబంధం అయిన అనారోగ్యం దరి చేరకుండా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించడంతో పాటు గ్యాస్ , కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, పైల్స్, గుండె పోటు నుంచి మనిషిని రక్షించడానికి ఈ ముద్ర ఎంతగానో సాయపడుతుంది. ఉదరం లో మొదలై గుండె దాకా వెళ్లే ఆరోగ్య సమస్యలపై ఈ ముద్ర తిరుగులేని అస్త్రం. ఒకప్పుడు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్న రజని వాటి నుంచి బయటపడేందుకు ఈ ముద్ర ఎంతో ఉపయోగపడింది. అందుకే సమయం తప్ప ఏ ఖర్చు లేని ఈ ముద్రకి ప్రచారం కల్పించే ఉద్దేశంతోటే దాన్ని పార్టీ సింబల్ గా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. అదండీ రజని సింబల్స్ వెనకున్న సీక్రెట్.