Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించిన కోహ్లీసేనపై పొగడ్తల వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీని పలువురు మాజీలు ఎంతగానో కొనియాడుతున్నారు. తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ జాబితాలో చేరాడు. కోహ్లీని తనదైన స్టయిల్ లో పొగిడాడు. తాము నేతృత్వం వహించిన కాలాల్లో భారత క్రికెట్లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే ముందుగానే ఎవరికైనా గుర్తొచ్చే పేరు సౌరవ్ గంగూలీ. కెప్టెన్సీకి అసలు సిసలు నిర్వచనం చెప్పిన గంగూలీ భారత్ కు స్వదేశంలోనే కాక… విదేశాల్లోనూ ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అదే తీరులో కనిపిస్తున్నాడన్నది సెహ్వాగ్ అభిప్రాయం. విరాట్ స్టయిల్ తననెంతో ఆకట్టుకుందన్న వీరూ ముఖ్యంగా కోహ్లీ దూకుడును చూస్తుంటే గంగూలీ అప్ గ్రేడెడ్ వెర్షన్ లా ఉన్నాడని కొనియాడాడు.
గంగూలీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో సిరీస్ విజయాలు సాధించిందని, ఇప్పుడు అలాంటి ధోరణి కోహ్లీలో కనిపిస్తోందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ సాధించిన విజయాలు… అతన్ని ఉత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలబెట్టాయని, గత ఎనిమిది సిరీస్ విజయాలను పరిశీలిస్తే కోహ్లీ నెం.1 సారధి అని చెప్పక తప్పదని వీరూ విశ్లేషించాడు. అదే సమయంలో గత ఉత్తమ కెప్టెన్లతో కోహ్లీని పోల్చడం సమంజసంకాదని, అలా పోల్చాలంటే కోహ్లీకి ఇంకా సమయం, మరింత అనుభవం కావాలని వ్యాఖ్యానించాడు. కెప్టెన్ గా కోహ్లీ ఏ మాత్రం ఒత్తిడికి గురవ్వడని, అతను బాధ్యతతో తన ఆటతీరు మెరుగుపర్చుకున్నాడని ప్రశంసించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో కూడా కోహ్లీసేన అద్భుతాలు సృష్టిస్తుందని సెహ్వాగ్ విశ్వాసం వ్యక్తంచేశాడు. ఒక్కో ఆటగాడి నుంచి అత్యుత్తమ ప్రతిభను కోహ్లీ వెలికితీస్తాడని, అతని బలం ప్రస్తుతమున్న బౌలింగ్ లైనపేనని, ఏ రోజైతే బౌలర్లు సరైన ప్రదర్శన చేయరో… ఆరోజు కోహ్లీ పతనం ప్రారంభమవుతుందని సెహ్వాగ్ హెచ్చరించాడు.