తెలంగాణలో తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల సింగిల్‌విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంపు రామచంద్రారెడ్డి కిడ్నాప్ కు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కిడ్నాప్‌నకు గురైన రామచంద్రారెడ్డి.. ఆ తర్వాత హత్య కాబడ్డాడు. అయితే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డిని ఆయన బంధువైన అన్నారం ప్రతాప్ రెడ్డి మరొకరితో కలిసి హత్య చేసినట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ మీడియాకు వెల్లడించారు. కాగా అన్నారంలోని భూమికి సంబంధించిన వివాదం విషయంలో ప్రతాప్ రెడ్డి.. రామచంద్రారెడ్డి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోందని.. ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని.. శుక్రవారం ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు నుండి ప్రతాప్ రెడ్డి మరో వ్యక్తి కలిసి రామచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. కొత్తూరు మండలం పెంజర్ల వద్ద రామచంద్రారెడ్డిని కత్తితో పొడిచి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని వివరించారు. కాగా భూమి వ్యవహారమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తమ విచారణలో వెలుగుచూసినట్లు వివరించారు.