వలేరీ ఫాక్స్ అనే 30 ఏళ్ల పోర్న్ స్టార్ ను కొట్టారంటూ వస్తున్న ఆరోపణలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఖండించాడు. ఈ వివాదం సమసిపోయిందని ఆయన ప్రకటించాడు. టీవీల్లో తనపై వస్తున్న వార్తలను చూసి షాక్ కు గురయ్యానని, ఆ నటి చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన వెల్లడించాడు. ఫాక్స్ తనపై కేసు పెట్టడం నిజమేనని, అయితే దీనిపై తనను విచారించిన పోలీసులు నిజానిజాలు తెలుసుకుని తన తప్పేమీ లేదని తేల్చారని వార్న్ ట్విట్టర్ లో తెలిపాడు. పోలీసులు తనను విచారించడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారని, స్థానికులతో కూడా మాట్లాడరని…ఫాక్స్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో వారు తనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వార్న్ వివరించాడు.
దయచేసి ఇక్కడితో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన విజ్ఞప్తిచేశాడు. లండన్ లోని ఓ నైట్ క్లబ్ లో శుక్రవారం రాత్రి షేన్ వార్న్ తనను కొట్టాడని, వలేరీ ఫాక్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. తన గాయాలను చూపిస్తూ ఆమె ట్విట్టర్ లో ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. పేరు ప్రఖ్యాతలున్నంతమాత్రాన ఓ మహిళను కొట్టి తప్పించుకోలేడని కూడా ఆమె హెచ్చరించింది. ఫాక్స్ ఫిర్యాదుతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు వార్న్ పై విచారణ జరిపారు. అయితే పోలీసుల విచారణలో తన తప్పేమీ లేదని తేలిందని వార్న్ ప్రకటించడం చర్చనీయాంశమయింది.