Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత వారం మరణించిన అతిలోకసుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక తలచుకుంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న 90వ ఆస్కార్ అవార్డుల వేడుకలో మెమోరియన్ విభాగంలో శ్రీదేవికి ఘననివాళి అర్పించింది. ప్రముఖ అమెరికన్ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడ్డర్ స్టేజ్ పైన సంగీత ప్రదర్శనతో శ్రీదేవికి నివాళులర్పించారు. శ్రీదేవి చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూపుతూ సినిమా రంగానికి ఆమె చేసిన సేవలను సభావేదిక గుర్తుచేసుకుంది. శ్రీదేవి పేరు వినపడగానే ఆడిటోరియం మొత్తం ఆమెను గుర్తుచేసుకుంటూ చప్పట్లు కొట్టింది. శ్రీదేవితో పాటు 2017 డిసెంబర్ లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ అలనాటి హీరో శశికపూర్ కు కూడా ఆస్కార్ వేదిక నివాళులర్పించింది. అటు ఆస్కార్ వేడుకలకు హాలీవుడ్ తారాగణం తరలివచ్చింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ ఏడాది ది షేప్ ఆఫ్ వాటర్ అవార్డులను కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా డైరెక్టర్ గులెర్మో డెల్ టోరోకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. ఈ చిత్రానికి మరో రెండు అవార్డులు కూడా దక్కాయి. ఉత్తమ నిర్మాణ డిజైన్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అవార్డులు కూడా ది షేప్ ఆఫ్ వాటర్ కే దక్కాయి. డార్కెస్ట్ అవర్ చిత్రానికి గానూ గ్యారీ ఓల్డ్ మ్యాన్ ఉత్తమనటుడిగా ఆస్కార్ గెలుచుకున్నాడు. త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్ సినిమాలో నటించిన ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ ఉత్తమ నటిగా నిలిచారు.