Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉప ఎన్నికల్లో నంద్యాల సీట్ కోసం పట్టుబట్టి టీడీపీ కి గుడ్ బై కొట్టిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కొత్త పార్టీలో చేరిపోయారు. అనుచరగణంతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆయన వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ సమక్షంలో కొత్త కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరిన వెంటనే ఆయన ఆ రోటి కాడ పాటే పాడారు. నంద్యాల ఉపఎన్నికల టికెట్ విషయంలో జగన్ మాటే తనకు వేదమన్నారు. జగన్ చెప్పిన మాట వింటానన్నారు. ఈమాటలు ఓ నెల కిందట చంద్రబాబు విషయంలోనూ చెప్పిన విషయం శిల్పా మర్చిపోయినా విన్నవారు మర్చిపోలేదు. వై.ఎస్ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని శిల్పా చెప్పుకున్నారు. చంద్రబాబు మీటింగులు తప్ప పని చేయరని విమర్శించారు. అందుకే సమర్ధవంతమైన జగన్ నాయకత్వంలో పని చేసేందుకు ముందుకొచ్చినట్టు శిల్పా తెలిపారు.
శిల్పా పైకి ఏమి చెప్పినప్పటికీ నంద్యాల టికెట్ మీద ఆయన భారీ ఆశలే పెట్టుకున్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ తన అభ్యర్థిత్వాన్ని కాదనదని శిల్పా భావిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు టికెట్ రాకపోయినా 2019 నాటికి డోకా ఉండదని శిల్పా అభిప్రాయం. కానీ ఆ టికెట్ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న మల్కిరెడ్డి ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శిల్పా వెళ్లిపోవడంతో టీడీపీ లో భూమా బ్రహ్మానంద రెడ్డి కి లైన్ క్లియర్ అయ్యింది. అటు వైసీపీ లో శిల్పా , మల్కిరెడ్డి మధ్య లొల్లి మొదలైంది.