Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ కు ముందే వైసీపీ చేతులెత్తేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి శిల్పామోహనరెడ్డి ఈ నెల 4న దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది. శిల్పామోహన రెడ్డి నామినేషన్ పత్రంపై టీడీపీ అనేక అభ్యంతరాలు వ్యక్తంచేసింది. నిబంధనల ప్రకారం నామినేషన్ ను నోటరీ చేయాల్సి ఉంటుంది. అయితే శిల్పామోహన రెడ్డి నామినేషన్ ను నోటరీ చేసిన న్యాయవాది రామతులసీరెడ్డి లైసెన్సు గడువు 2013తో ముగిసిపోయిందని, ఆయన సంతకం చెల్లదని టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుచేశారు. జిల్లా రిజిస్ట్రార్ నుంచి తెచ్చిన లేఖను కూడా తమ ఫిర్యాదులో పొందుపరిచారు. దాంతో పాటు నామినేషన్ కు శిల్పామోహన్ రెడ్డి జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ కూడా వాడలేదని, ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు.
అటు శిల్పామోహన రెడ్డి కుమారుడు వేసిన నామినేషన్ కూడా రామతులసీ రెడ్డే నోటరీ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి నామినేషన్లను ఈసీ తిరస్కరిస్తే వైసీపీ బరిలో ఎవరూ లేనట్టే. ఇక అప్పుడు ఉప ఎన్నిక లాంఛనప్రాయం అవుతుంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని వైసీపీ కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదుచేసింది. ఆయన ఆదాయపు పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదని వైసీపీ ఆరోపించింది. టీడీపీ, వైసీపీ ఫిర్యాదులను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నిబంధనల ప్రకారం ఉండకపోతే వాటిని తిరస్కరించిన ఘటనలు గతంలో జరిగాయి. 2009లో కదిరి నుంచి టీడీపీ తరపున కదిరి బాబూరావు వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అసలే నంద్యాల బహరింగసభలో జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడ్డ వైసీపీకి ఇప్పుడు శిల్పామోహనరెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురయితే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే…
మరిన్ని వార్తలు: