మోడీకి షాకిచ్చిన శివ సేన !

Shiv Sena Shock To Modi

దేశంలో భారతీయ జనతా పార్టీని ఎలాగైనా గద్దె దించాలని అన్ని రాష్ట్రాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. నిజానికి మహారాష్ట్రలో బాల్ థాకరే మరణం తర్వాత శివసేన పార్టీ పై పెత్తనం చెలాయించాలని చూసింది బీజేపీ. ఈ మేరకు ఆ పార్టీని కబళించే ప్రయత్నాలు కూడా చేశారు బీజేపీ పెద్దలు. అయితే ఆ విషయం తెలియగానే శివసేన బీజేపీ పై విరుచుకు పడటం ప్రారంభించింది. ప్రతిపక్ష నేతలను మించి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి శివసేన వర్గాలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామే తప్ప భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని తేల్చేశాయి. మరోవైపు బీజేపీ పార్టీ మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో శివసేన వర్గాలను ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాగైనా శివసేన పార్టీని మచ్చిక చేసుకొని బీజేపీని బలపరచాలని ఆ పార్టీ వర్గాలు కొత్త ప్లాన్స్ రచిస్తున్నాయి.

ఇందులో భాగంగానే ముంబైలో నిర్మిస్తున్న బాల్‌థాకరే మెమోరియల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు మోడీ. ఇలాగైనా శివసేన వర్గాలు తమ వైపు మొగ్గు చూపుతాయేమో అని చూశారు. కానీ ఆ నిర్మాణానికి బీజేపీ పెద్ద మొత్తం కేటాయించడాన్ని స్వాగతిస్తూనే మీతో అయితే పొత్తు పెట్టుకునేదే లేదని స్పష్టం చేసింది శివసేన. దీంతో మోడీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలినట్లయింది. నితిన్ గడ్కరీని ప్రధానిని చేస్తామంటే అప్పుడు బీజేపీ పొత్తు గురించి ఆలోచిస్తామని చెప్పి మరో పంచ్ వేసింది శివసేన పార్టీ. అంటే గడ్కరీకి శివసేన సపోర్ట్ ఉందని క్లియర్ అయింది. ఎటూ మోడీ ప్రధాని అభ్యర్ధిత్వం గడ్కరీకి ఇవ్వడు, దీంతో మహారాష్ట్రలో బాగా పట్టున్న శివసేన మద్దతు బీజేపీకి లేదని అర్థమైపోయింది. ఇక మోడీ ఎన్ని ప్లాన్స్ వేస్తే మాత్రం ఏం లాభం? అన్ని చోట్లా ఇలాంటి నిరసనలే ఎదురవడంతో ఆయన ఈసారి ప్రధాని కావడం కష్టం అనే మాటలే వినపడుతున్నాయి