ఊర్మిళా‌ ఆశలు అడియాశలు

ఊర్మిళా‌ ఆశలు అడియాశలు

చట్టసభలోకి అడుగుపెట్టాలనుకుంటున్న రంగీలా ఫేమ్‌ ఊర్మిళా మటోండ్కర్‌ ఆశలు అడియాశలు అయ్యేలానే కనిపిస్తున్నాయి. అధికార శివసేన నుంచి శాసనమండలికి నామినేట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాష్‌ ఆఘాడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు పార్టీల నేతలు ఓ అంచనాకు సైతం వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్‌ నామినేటెడ్‌ సభ్యుల కోటాలోంచి బాలీవుడ్‌ నటి ఉర్మిళా మాతోండ్కర్‌ను విధాన పరిషత్‌కు పంపడం ఖాయమని తేలడంతో శివసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఉర్మిళ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆమె కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటపడ్డారు. ఇప్పుడు శివసేన అధిష్టానం ఆమెను ఏకంగా విధాన పరిషత్‌కు పంపించనున్నట్లు తెలియడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.