Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పర్యాటక ప్రాంతం గోవా డ్రగ్స్, లిక్కర్ మాఫియాకు కేంద్రంగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై తన కరపత్రిక సామ్నాలో ప్రత్యేక కథనం రాసిన శివసేన బీజేపీపై నిప్పులు చెరిగింది. గోవాలోని కొన్ని ప్రాంతాలు రష్యన్లు, నైజీరియన్ల గుప్పిట్లో ఉన్నాయని, స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేరని శివసేన విమర్శించింది. ధైర్యముంటే విదేశీయుల ఆధిపత్యంలోని ప్రాంతాలను బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవాకి అలగాజనమే వస్తున్నారని గోవా వ్యవసాయ శాఖ మంత్రి సర్ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది.
దేశీయ పర్యాటకులను దూషించడం బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికింది. చేతనైతే విదేశీయులపై ఉక్కుపాదం మోపాలని సవాల్ చేసింది. దేశీయ పర్యాటకులపై గోవా ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించింది. గోవా సంస్కృతి, గోవా తత్త్వాన్ని దెబ్బతీసే వారిని తరిమికొట్టాలని,గోవాకు చెందిన మరో మంత్రి మనోహర్ అజ్ గోవాంకర్ చేసిన వ్యాఖ్యలపై కూడా శివసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉత్తర భారతీయులు గోవాను మురికి కూపంగా మారుస్తున్నారని గోవా మంత్రి అంటున్నారని, కానీ పర్యాటకం వల్లే ఆ రాష్ట్రం నడుస్తోందని, అందుకే శాంతిభద్రతలు గాలికొదిలేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించింది.