Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఓ విషయం షేర్ అవుతోంది. అమెరికా గొప్పగా చెప్పుకుంటున్నట్టు విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదని…వారికన్నా ఎనిమిదేళ్ల ముందుగానే శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయుడు ఇండియాలో తొలి విమానాన్ని తయారుచేశాడని, అయితే అప్పుడు పరాయి పాలనలో ఉన్న భారత్ … ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పినా ఎవరూ నమ్మలేదని…భారతీయుడి ఆవిష్కరణను రైట్ సోదరులు హైజాక్ చేశారు అన్నది సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ పోస్ట్ సారాంశం. ఈ విషయాన్ని దేశంలో సాధారణ పౌరులు ఎంతమంది నమ్ముతున్నారో తెలియదు కానీ… సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రి మాత్రం ఇదే నిజమని ఘంటాపథంగా చెబుతున్నారు. అంతేకాదు… విమానాన్ని కనుగొన్నది శివకర్ బాపూజీ తల్సాడే అని పాఠ్యపుస్తకాల్లో సైతం చేర్చాలన్నది ఆయన అభిప్రాయం. ఇంతకీ ఆయన ఎవరో కాదు… సాక్షాత్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి సత్యపాల్ సింగ్.
క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యపాల్ సింగ్ ఢిల్లీలోని ఓ కాలేజీలో చేసిన ప్రసంగం అచ్చం ఆరెస్సెస్ నేతల తీరును తలపించింది. విమానాన్ని 1903లో రైట్ బ్రదర్స్ కనుక్కొన్నారని ప్రపంచమంతా తప్పుడు భావనలో ఉందని, నిజానికి అంతకు ఎనిమిదేళ్ల ముందే భారత్ లో విమానం తయారయిందని, శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయుడు విమానాన్ని తయారు చేశాడని సత్యపాల్ సింగ్ విద్యార్థులతో చెప్పారు. ఈ విషయాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడిదాకా బాగానే ఉంది గానీ… సత్యపాల్ సింగ్… తన ప్రసంగాన్ని పురాణాలకు సైతం ముడిపెట్టారు. అసలు ఆధునిక విమానాల కంటే ముందే మనదేశంలో పుష్పకవిమానం ఉందని, రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పుష్పకవిమానం గురించి ఐఐటీ విద్యార్థులకు చెప్పాల్సి ఉందని ఈ మాజీ ఐపీఎస్ అధికారి సూత్రీకరించారు.
సీతాదేవిని కిడ్నాప్ చేసిన తరువాత రావణుడు ఆమెను పుష్పకవిమానంలోనే లంకకు తీసుకెళ్లాడని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. పూర్వకాలంలో భారతీయులు చేసిన ఎన్నో ఆవిష్కరణలను విదేశీయులు తమ ఖాతాల్లో వేసుకున్నారని కూడా కేంద్రమంత్రి మండిపడ్డారు. మొత్తానికి గతంలో ఆరెస్సెస్ నేపథ్యం లేకపోయినప్పటికీ కొత్త కేంద్రమంత్రులు కొందరు బాధ్యతలు చేపట్టగానే కాషాయదళం మనసెరిగి నడుచుకుంటున్నట్టు ఈ వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతోంది. అటు సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కొందరు కేంద్రమంత్రులు అన్ని పరిధులూ దాటి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత పిసి చాకో ఎద్దేవా చేశారు. సత్యపాల్ సింగే కాదు… ఇటీవల కొందరు బీజేపీ నేతలు అన్ని విషయాలనూ పురాణాలకు ముడిపెడుతూ వ్యాఖ్యలుచేస్తున్నారు. .కొన్ని రోజుల క్రితం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ… ఇస్రో అభివృద్ధి చేస్తున్న రాకెట్లు రామబాణాలని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.