టీ కాంగ్రెస్ కి షాక్….కారెక్కనున్న మాజీ స్పీకర్…!

Shock For Telangana Congress
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలయింది. ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా ఇతర పార్టీల్లో సమర్ధులైన ఇప్పుడు కాస్త తటస్థంగా ఉన్న నేతలకు గాలం వేసేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు స్వయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అయిన కాసేపటికి సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. సురేశ్ రెడ్డికి కేసీఆర్ తో 1989 నుంచి పరిచయం ఉందని కేటీఆర్ తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీల్లో పనిచేసినప్పటికీ, ఆలోచనలు వేరైనప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇద్దరికీ భావసారూప్యత ఉండేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కలసి పనిచేద్దామని కేసీఆర్ పంపిన ఆహ్వానాన్ని సురేశ్ రెడ్డి మన్నించారని పేర్కొన్నారు.
kcr
సురేశ్ రెడ్డిని ఆహ్వానించడానికి తాను, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలసి ఆయన నివాసానికి వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. సురేశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా పనిచేశారనీ, టీఆర్ఎస్ లో ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సురేశ్ రెడ్డితో పాటు వందలాది మంది ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరుతారని ప్రకటించారు. తమ ఆహ్వానాన్ని మన్నించినందుకు కేటీఆర్ సురేశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాల్కొండలో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసిన సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా బాల్కొండ పార్టీ టికెట్ ను ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి భవిష్యత్తులో పార్టీ పదవి లేదా ఏదైనా ప్రభుత్వ నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
kcr-suresh