నిన్న ప్రచారంలో భాగంగా రేవంత్ షబ్బీర్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. “మీ నియోజకవర్గంలో షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆయన నంబర్-2 పొజిషన్ లో ఉంటారు. మీకు మేలు జరుగుతుంది” అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంకా సీట్ల సర్దుబాటు లేదు, అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండానే ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలేమిటని సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. రేవంత్ మాటలపై ఎవరూ బహిరంగంగా విమర్శించకపోయినా, ఈ కొత్త సంస్కృతితో పార్టీకి నష్టమేనని అధిష్టానానికి సీనియర్లు నివేదించి నట్టు చెబుతున్నారు.
పార్టీలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యాఖ్యలు మంచివి కావని, ఎన్నికల వేళ, పదవులు, స్థానాల గురించి మాట్లాడితే, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటూ, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు రాహుల్ గాంధీకి లేఖను రాసినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా, షబ్బీర్ అలీ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి అవుతారన్నట్టు రేవంత్ చేసిన వ్యాఖ్యలు అటు తెలుగుదేశం పార్టీలోనూ ప్రకంపనలు పుట్టించాయి. ఇంకా సీట్ల సర్దుబాటు చేయుండానే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని వారు కూడా కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.