Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న కర్నాటకలో ఓటింగ్ చురుగ్గా సాగుతోంది. వృద్ధులు, యువకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాన్నిచ్చాయి. ఉదయం 11 గంటల సమయానికే రాష్ట్ర వ్యాప్తంగా 24శాతం పోలింగ్ నమోదయినట్టు ఈసీ అధికారులు చెప్పారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లో బెంగళూరులో ఓటువేశారు. అనిల్ కుంబ్లే తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చుని ఉన్న ఫొటోను కుంబ్లే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్నడ నటులు రమేశ్ అరవింద్, రవిచంద్ర కూడా బెంగళూరులో ఓటు వేశారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఎన్నికల్లో ఓటింగ్ పెంచేందుకు బెంగళూరులోని ఓ హోటల్ యజమాని వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణరాజ్ ఇవాళ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు తన హోటల్ లో ఉచితంగా దోశ అందిస్తున్నారు. అలాగే ఓటు వేసిన ఇతరులకు ఉచితంగా ఫిల్టర్ కాఫీ రుచిచూపిస్తున్నారు. అయితే ఉచిత దోశ, కాఫీ కావాలంటే…ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును హోటల్ లో చూపించాల్సి ఉంటుంది. బెంగళూరులో తక్కువగా నమోదవుతున్న ఓటింగ్ శాతాన్ని పెంచడానికే తాను ఇలా వినూత్నంగా ముందుకొచ్చినట్టు కృష్ణరాజ్ తెలిపారు. ఎవరికి ఓటు వేసినా పర్లేదని, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకుని..తమ హోటల్ లో ఉచితంగా దోశ, కాఫీ రుచిచూడాలని ఓటర్లకు ఆఫర్ ఇచ్చారు కృష్ణరాజ్…మొత్తానికి ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాలతో కర్నాటక ప్రజలలో ఓటింగ్ పై చైతన్యం పెరిగింది.