రక్షణ కరువైన సచివాలయ ఉద్యోగులు:వారి పై ఎస్ఐ దాడి

ఆంధ్రప్రదేశ్ లో సచివాలయం వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందని దేశమంతా సంచలన వార్తా ప్రసారాలు వెల్లువెత్తాయి. కానీ.. అక్కడక్కడ కొని ఘటనలు సచివాలయ వ్యవస్థకు మచ్చ తెస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. సచివాలయ ఉద్యోగులను ఎస్ఐ చితకబాదాడు. అసలేం జరిగిందంటే.. నెల్లూరులో ఓ మహిళను కొడుతుండగా వీడియో తీశాడన్న కోపంతో… సచివాలయ ఉద్యోగి బాబూరావు, వార్డు వాలంటీర్ సంపన్నకుమార్‌పై సంతపేట ఎస్ఐ వెంకటరమణ.. దాడి చేశాడు.

నెల్లూరు జిల్లాలోని కపాడిపాళెంలో సచివాలయం ఉద్యోగిపై, వార్డు వాలంటీర్‌పై సంతపేట ఎస్‌ఐ వెంకటరమణ చేసిన దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎస్ఐ తీరుకు నిరసనగా సచివాలయ ఉద్యోగులు, స్థానికులు ‌పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమాచారం మేరకు కపాడిపాళెంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉన్న గ్రామ సచివాలయంలో బాబురావు పనిచేస్తున్నాడు. అక్కడే సోని సంపన్నకుమార్‌ వార్డు వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా వారిద్దరు గ్రామంలోని ప్రజలకు పెన్షన్లు అందచేసి తిరిగి సచివాలయానికి వస్తున్న సమయంలో ఓ ఘటన చోటుచేసుకుంది.

అదేమంటే.. సంతపేట ఎస్‌ఐ వెంకటరమణ, కొందరు కానిస్టేబుళ్లు ఆ దిశగా వస్తూ రోడ్లపై ఉన్న ప్రజలను ఇళ్లలోకి వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అదే సమయంలో కానిస్టేబుళ్లు ఓ మహిళపై దాడి చేస్తుండగా వాలంటీర్ సంపన్నకుమార్‌ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సచివాలయానికి వెళ్లిపోయాడు. దాన్ని గమనించిన ఎస్‌ఐ వెంకటరమణ నేరుగా సచివాలయంలోకి వెళ్లి అతడిని చితకబాదుతూ బయటకు లాక్కొచ్చాడు. పక్కనే ఉన్న బాబూరావు తాము ప్రభుత్వ ఉద్యోగులమంటూ ఐడీ కార్డులు చూపించడంతో ఎస్ఐ మరింత రెచ్చిపోయాడు. వాడికే సపోర్ట్ చేస్తావా? అంటూ బాబూరావు పైన కూడా దాడిచేసి ఇద్దరినీ జీప్ ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో సంతపేట పోలీసుస్టేషన్‌ కు చేరుకొని నిరసనకు దిగారు. ఎస్‌ఐ వెంకటరమణ గతంలో కూడా పలుసార్లు ప్రజలపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా ఈ ఎస్ఐ గర్భిణీలు, బాలింతలను  చితకబాదాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాగా ఇప్పుడున్న ఈ సమయంలో సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తుంటే.. తమపై దాడి చేయడం సరికాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ వెంకటరమణ కొద్ది రోజుల క్రితం ఓ జర్నలిస్టుపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత మళ్లీ ఇలా సచివాలయ ఉద్యోగులపై దాడికి దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతుంది.