Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల ప్రచారంలో నేతల తడబాట్లు సాగుతున్నాయి. గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పబోయి….యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనే సరికి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు విని యడ్యూరప్ప కూడా ఖంగుతిన్నారు. పక్కన ఉన్నవారు యడ్యూరప్ప కాదు….సిద్ధరామయ్య అని చెప్పడంతో అమిత్ షా మళ్లీ సర్దుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్ అని ఆరోపించారు. అప్పట్లో ఇది వైరల్ గా మారింది. దీనిపై సిద్ధరామయ్య అనేకసార్లు అమిత్ షాను ఉద్దేశించి కౌంటర్లు కూడా వేశారు. బీజేపీ అధ్యక్షుడు తమ అభ్యర్థినే అవినీతిపరుడన్నారని విమర్శించారు. అమిత్ షాను అంతగా విమర్శించిన సిద్ధరామయ్య కూడా ఇప్పుడు అదే విధంగా పొరపాటుగా మాట్లాడి దొరికిపోయారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధరామయ్య కాంగ్రెస్ నేత నరేంద్ర స్వామి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే నరేంద్ర స్వామి అనబోయి పొరపాటుగా నరేంద్రమోడీ అన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఇళ్లనిర్మాణం తదితర పనులు నరేంద్రమోడీ, తమ ప్రభుత్వం వల్లే జరిగాయని వ్యాఖ్యానించారు. వెంటనే స్వామి కలగజేసుకోవడంతో సిద్ధరామయ్య నాలుకకరుచుకున్నారు. వెంటనే సారీ సారీ..నరేంద్ర స్వామి అని చెప్పారు. వెంటనే తన తడబాటును కప్పిపుచ్చుకునేందుకు నరేంద్రస్వామిని, నరేంద్రమోడీని పోల్చుతూ విమర్శలు చేశారు. స్వామి కర్నాటకలో ఉన్నారని, మోడీ గుజరాత్ లో ఉన్నారని, నరేంద్ర మోడీ ఫిక్షన్ అని, నరేంద్ర స్వామి నిజం అని చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంచేశారు. సిద్ధరామయ్య మాటలకు వేదికపై కూర్చున్న నాయకులు సహా..సభకు వచ్చిన ప్రజలు కూడా నవ్వులు చిందించారు. మొత్తానికి ఎన్నికల ప్రచార సభల్లోనూ, సోషల్ మీడియాలోనూ మోడీపై విమర్శల వర్షం కురిపించే క్రమంలో…మోడీ..మోడీ అనే పదం..సిద్ధరామయ్యకు ఊతపదంగా మారినట్టుంది.