హైదరాబాద్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. ఆ పార్టీకి ఉన్న ఏకైక సభ్యుడు మందడి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు. పదవితోపాటు పార్టీకి రాజీనామాచేసి ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరికలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి తలసానికి ప్రత్యర్థిగా పోటీ చేసిన కూన వెంకటేష్ గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ కూనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంకటేష్ గౌడ్‌ను తలసాని వెంటబెట్టుకొని కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. కూన వెంకటేష్ గౌడ్‌తో పాటూ కేపీహెచ్‌బీ టీడీపీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కూడా టీఆర్ఎస్గూటికి చేరారు. కేటీఆర్ మందాడిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మందాడి శ్రీనివాసరావు 2018 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. కేపీహెచ్‌బీ కాలనీ నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక కార్పొటర్గా నిలిచారు. మొత్తానికి ఈ ఇద్దరు టీడీపీ కీలక నేతలు టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే మందాడి మాత్రం మరోపక్క పైగా తాను పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పూర్తి ప్రశ్నార్థకంగా మారిందని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం కూడా తనకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.