Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఒక పక్క స్లైడ్స్ వేస్తూ మరో పక్క హీరోలను మొదలుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు అందరి చేతా మందు కొట్టించేస్తుoటారు మన దర్శకులు. కొత్త హీరోలు అయితే పర్లేదు అదే పేరున్న, పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ల చేత గనుక మందు కొట్టించే సీన్లు ఉంటె అవి కట్ చేయడం మంచిది ఎందుకు అంటే వారిని చూసి వారి అభిమాన గణం కూడా అదేదో ఘనకార్యం లాగా వారు కూడా అలవాటు చేసుకుంటున్నారు.
అయితే ఇదే విషయాన్ని ఓ హీరో గుర్తించాడు అతనే టీవీ యాంకర్ నుండి కోలీవుడ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగిన యువ హీరో శివ కార్తికేయన్. ఆ హీరో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటంటే ? కార్తికేయన్ మీద పై ఈ మధ్యలో కాలంలో విమర్శలు బాగా పెరిగాయి. అతను నటించే చిత్రాల్లో మందు తాగే దృశ్యాలు, అమ్మాయిలను గేలి చేసే సన్నివేశాలు అధికంగా ఉంటున్నాయని విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా ‘రెమో’ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ ను తన ప్రేమలో పడేసేందుకు కార్తికేయన్ వేసే వేషాలు అమితమయిన వినోదాన్ని పంచినా, దానికి రెండింతలు విమర్శలనూ మోసుకొచ్చాయి. దీంతో ఇకపై అటువంటి సన్నివేశాల్లో నటించకూడదని శివకార్తికేయన్ నిర్ణయించుకున్నాడట. ఏది ఏమయినా ఇలా ఒక నటుడు సామాజిక దృక్పదంతో ఇలా చేయడం అనేది స్వాగతించ వలసిన విషయం.
ఈ విషయంపై కార్తికేయన్ మాట్లాడుతూ ‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను ఒక సాధారణ నటుడ్ని. అలా నటించను, ఇలా నటించను అని చెప్పలేను. అందువల్ల దర్శకులు చెప్పినట్టే నటించాను. ‘వేలైక్కారన్’ సినిమా తరువాత నాపై సామాజిక బాధ్యత పెరిగింది. ఆ సినిమాలో మందు కొట్టే సీన్ కాని, అమ్మాయిల్ని ఏడిపించే సీన్ కాని లేదు. కనీసం పాటల్లోను ఎక్కడా ఇటువంటివి తెరకెక్కించలేదు. అయినా ఎవరూ నన్ను మెచ్చుకోలేదు. ఏదేమైనప్పటికీ… ఇకపై నటించబోయే సినిమాల్లో మందు తాగే, గేలి చేసే దృశ్యాలు ఉండవు’ అని చెప్పాడు.