జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని రాజకీయ విశ్లేషకులు, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ పార్ట్ టైం పొలిటిషియన్ అని….కొంతకాలం నుంచి మాత్రమే ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. బహిరంగ సభల్లో పవన్ సినిమాలో చెప్పిన మాదిరి నాలుగు డైలాగులు చెప్పి పూనకం వచ్చిన వాడిలా ఆవేశపడిపోతారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుంటాయి. అదేంటో నిన్న పవన్ ను చూస్తుంటే అలానే అనిపించింది. ఎంత సేపూ తోలు తీస్తా.. తాట తీస్తా.. గోదాట్లో కలిపేస్తా..నలిపేస్తా అంటూ పవన్ తన ప్రసంగాన్ని సాగించారు.
అంతే కాక నిన్న లోకేష్ మీద పవన్ అర్ధం లేని ఆరోపణలు చేశారని స్పష్టం అవుతోంది. అంటే ఆయన వాదన ప్రకారం జిల్లా కలెక్టరుగా పని చేసేవారంతా ముందు బిల్ కలెక్టరుగా పనిచేసి ఉండాలనేలా పవన్ ఆలోచనా విధానం ఉంది. మరి సొంత ఊరిలో కూడా గెలవలేక ఎక్కడో తిరుపతి ప్రజలు దయ తలచి గెలిపిస్తే దానికి రాజీనామా చేసి కాంగ్రెస్ దయతో రాజ్య సభ ఎంపీ అయి, టూరిజం శాఖ మంత్రిగా చిరంజీవి ఎందుకు పని చేశారో, దీనికి లాజిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఆయన టూరిస్ట్ గైడ్ గా పనిచేసారు కాబట్టి ఆయన టూరిజం మంత్రి అయిపోవచ్చనేలా తయారయ్యింది పవన్ మనస్థితి. అంతే కాక మాట్లాడితే మునసబు మనవడు, కానిస్టేబుల్ కొడుకు అనే బ్రాండ్ ఇమేజ్ కోసం పాకులాడుతున్న పవన్ కళ్యాణ్, అసలు తాను ఇప్పుడు ఎటువంటి ఇమేజ్ వాడుకుని స్టార్ హీరో అయ్యాడో మర్చిపోయినట్టు ఉన్నాడు. పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడు కాకుండా కేవలం కానిస్టేబుల్ కొడుకు మాత్రమే అయి ఉంటే ఈ రోజు ఎక్కడ ఉండేవారు ? సినిమా హీరో అయ్యేవారా ? ఆ హీరోయిజంతో వచ్చిన క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీని స్థాపించి ఉండేవారా ? పవన్ కల్యాణ్ హీరో అయినా రాజకీయ పార్టీ స్థాపించినా అది పూర్తిగా చిరంజీవి వారసుడిగానే. మెగాస్టార్ సోదరుడిగానే పవన్ కల్యాణ్‌కు సినిమా అవకాశాలొచ్చాయి. రాజకీయ అవకాశాలొచ్చాయి. ఈ మాటలే పవన్ లోని అపరిపక్వతను మాటిమాటికీ ఎత్తి చూపుతున్నాయి.