Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసాడు అని ఈ మధ్య ఎక్కువ సార్లు వినిపించిన మంత్రి పేరు గంటా శ్రీనివాసరావు. మంత్రి అయ్యన్నపాత్రుడుతో అంతర్గత కలహాలు, విశాఖ భూకుంభకోణం, తాజాగా కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో టీచర్ల బయో మెట్రిక్ విధానం అమలు… ఇలా విషయం ఏదైనా గంటా ని సీఎం చంద్రబాబు ఎక్కువసార్లు గంటాని ఆగ్రహించినట్టు వార్తలు చూస్తున్నాం. ఓ దశలో దీని వెనుక లోకేష్ హస్తం ఉందని, ఆయన అయ్యన్న పాత్రుడుని సపోర్ట్ చేస్తున్నారని కూడా ప్రచారం సాగింది. ఇంకో దశలో అసలు గంటాని మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా పుకార్లు రేగాయి. అయితే మంత్రివర్గ విస్తరణ తర్వాత అదేమీ నిజం కాదని తేలింది. గంటా వ్యతిరేకులు చాలా మంది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు సంబరపడుతుంటారు. కానీ ప్రతిసారి వారికి నిరాశ తప్పదు.
ఇలా ఎందుకు జరుగుతుందో వారికి అర్ధం కాదు. గంటా ని కోప్పడతారేమో గానీ ఆయన్ని బాబు ఎందుకు దూరం పెట్టరో ఎవరికీ అర్ధం కాదు. ఇటీవలే ఆ సీక్రెట్ బయటపెట్టారు మంత్రి సోమిరెడ్డి. ఇటీవల ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సోమిరెడ్డి బాబుతో తనకి వున్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు. ఏదైనా అంశం మీద ఆయనతో కొన్ని సార్లు సీరియస్ గా వాదించే సందర్భాలు, ఆయన తనని మందలించే సందర్భాలు వుంటాయని చంద్రమోహనరెడ్డి చెప్పుకున్నారు. ఎప్పుడైనా ఆయన తమతో కాస్త కోపం, హెచ్చరిక ధోరణితో మాట్లాడారు అంటే దాని అర్ధం బాబు తమకు ఏదో మంచి చేయబోతున్నాడని అట. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ ముందు కూడా అలాంటి సందర్భం ఎదురు అయ్యిందట. బాబు గారి మందలింపు అయిపోయిన వెంటనే బయటికి వచ్చి తన భార్యకి ఫోన్ చేసి ఈసారి క్యాబినెట్ పదవి వస్తుందని చెప్పారట సోమిరెడ్డి. ఆయన చెప్పినట్టే జరిగింది. సోమిరెడ్డి మంత్రి అయ్యారు. బాబు గారి కోపం వెనుక ప్రేమని ఇలా పసిగట్టేసారు సోమిరెడ్డి. ఈ మాటల్ని కాస్త గంటాకు అన్వయించుకుంటే మ్యాటర్ ఏంటో తేలిగ్గా అర్ధం అయిపోతుంది.