బాబు పై సోము ఫైర్ అయితే షా మంద‌లించాడా?

Somu Veerraju Fires On Chandrababu Then Amith Shah Warning Him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేంద్రప్ర‌భుత్వంతో ఇప్పుడంటే చంద్ర‌బాబు క‌య్యానికి కాలుదువ్వుతున్నారు కానీ… నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న చాలా స‌హ‌నంగా వ్య‌వ‌హ‌రించారు. విభ‌జ‌న హామీల విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యం, త‌న‌కు మోడీ అపాయింట్ మెంట్ నిరాక‌రించ‌డం వంటి అంశాల‌తో పాటు… రాష్ట్ర బీజేపీ నేత‌ల వ్య‌వ‌హార‌శైలిపైనా చంద్ర‌బాబు ఎంతో సంయ‌మ‌నం పాటించారు. రాష్ట్రానికి చెందిన కొంద‌రు బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చంద్ర‌బాబును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. వారిలో ముందువ‌రుస‌లో ఉన్న నేత బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. టీడీపీ, బీజేపీ మిత్రబంధం స‌జావుగా న‌డుస్తున్న రోజుల నుంచే… సోమువీర్రాజు ఎందుక‌నో టీడీపీపైనా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపైనా అదేప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. కొన్ని సందర్బాల్లో సోమువీర్రాజు వ్యాఖ్య‌ల‌కు కొంద‌రు టీడీపీ నేత‌లు గ‌ట్టి స‌మాధాన‌మిచ్చే ప్ర‌య‌త్నం చేసినా ముఖ్య‌మంత్రి మాత్రం వారిస్తూ వ‌చ్చారు. దీన్ని అవ‌కాశంగా తీసుకుని సోమువీర్రాజు మ‌రింత ఎక్కువ‌గా త‌న విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగించారు.

రెండు పార్టీల మ‌ధ్యా సాధార‌ణ ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడే అదేప‌నిగా విమ‌ర్శ‌లు చేసే సోమువీర్రాజు… ఇక ఇప్పుడు మాట్లాడ‌కుండా ఉంటారా… కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత బీజేపీతో మిత్ర‌బంధాన్ని ప‌క్క‌నబెట్టి ఎప్పుడైతే టీడీపీ నేత‌లు పోరుబాట ప‌ట్టారో… అప్ప‌టినుంచి ఇక సోమువీర్రాజు నోటికి హ‌ద్దూ, అదుపూ లేకుండా పోయింది. రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌బెట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వ్య‌క్తిగ‌త విమర్శ‌ల‌కు దిగారు. రెండెక‌రాల రైతు అని చెప్పుకునే చంద్ర‌బాబుకు ల‌క్ష‌ల కోట్ల‌రూపాయ‌ల ఆస్తులు ఎలా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ అవినీతికి మారుపేర‌ని, ముఖ్య‌మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. సోమువీర్రాజు వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ నేత‌లే కాకుండా సొంత పార్టీ నేత‌లు సైతం సోమువీర్రాజు వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. మిత్ర‌ప‌క్షం నేత‌ల‌పై సోమువీర్రాజు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం సరికాద‌ని రాష్ట్ర బీజేపీ మంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర నేత‌లే కాదు… బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సైతం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌కు గానూ సోమూ వీర్రాజును మంద‌లించిన‌ట్టు వార్త‌లొచ్చాయి.

సోమువీర్రాజుకు ఫోన్ చేసిన అమిత్ షా మ‌ళ్లీ ఇలాంటివి పున‌రావృతం కానివ్వ‌రాద‌ని హెచ్చ‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై సోమువీర్రాజు స్పందించారు. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని, అమిత్ షా నుంచి త‌న‌కు ఎలాంటి ఫోన్ రాలేద‌ని, కావాలంటే కాల్ డేటా చూసుకోవాల‌ని అన్నారు. త‌న గొంతు నొక్కే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. త‌న‌ను వైసీపీ కోవ‌ర్ట్ అంటోంటే న‌వ్వు వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌న ఊపిరి ఉన్నంత‌వ‌ర‌కు జాతీయ రాజ‌కీయాల‌పై మాట్లాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అయితే సోమువీర్రాజు ఎంత గొంతు చించుకున్నా ఆయ‌న వైసీపీకి అనుకూలవాది కాదంటే ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని, టీడీపీపై ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల‌తో పాటు… వైసీపీపై క‌న‌బ‌రిచే సానుకూల వైఖ‌రే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.