పబ్జీ పిచ్చి జనాల్లో ఎంతగా ముదిరిపోయిందో చెప్పేందుకు ఇటీవల జరిగిన కొన్ని నేరాలు, దారుణాలే నిదర్శనం. ఈ ఆటకు బానిసలైన వ్యక్తులు వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. 24 గంటలు పబ్‌జీ ప్రపంచంలోనే ఉంటూ.. పబ్‌జీ కోసమే ఆలోచిస్తూ నిద్రాహారాలు మానేస్తున్నారు. ఆప్తులను దూరం పెడుతున్నారు. ఆ గేమ్‌కు అడ్డు పడితే.. ఇక అంతే సంగతులు. ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన బెంగుళూర్ సిద్దేశ్వర్‌నగర్ కాకాటి వద్ద జరిగింది. పబ్జీ గేమ్‌ను ఆడకూడదన్న తండ్రిని కన్నకొడుకే అతి కిరాతకంగా హత్య చేశాడు. .ఏకంగా తండ్రి తలను నలికి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడూ పబ్జీ ఆడుతున్న కొడుకు రఘువీర్‌ని మందలించాడు శంకర్.
పబ్ జీ ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పినా..వినవా అంటూ కోపడ్డాడు. . దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న యువకుడు… దారుణానికి పాల్పడ్డాడు. తండ్రిపై దాడి చేసి …తల నరికేశాడు. ఫోన్ కు నెట్ తీశాడన్న కారణంతో తండ్రిపైనే కక్షపెంచుకున్న రఘువీర్ కుంబర్ తన తండ్రి శంకర్‌ను అతిదారణంగా హత్య చేశాడు.ఫోన్ విషయంలో తండ్రి కొడుకుల మద్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందని స్ధానికులు చెబుతున్నారు.టైమ్‌పాస్ కోసం వీడియో గేమ్‌లు ఆడితే పర్వాలేదు. అదే పనిగా ఆడుతూ వాటికి బానిసైపోతున్నారు. ఆడవద్దని అడిగిన వారిపై విరుచుకుపడుతున్నారు. గట్టిగా మందలిస్తే హత్యలు చేయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడటం లేదు. మరీ పబ్జీ గేమ్ అయితే చెప్పనక్కర్లేదు. ఆడేటప్పుడు ఎవరైనా పిలిచినా, ఫోన్ మ్రోగినా పట్టించుకోరు. ఇప్పటికైనా ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.