దేశరాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో కన్నా కొడుకే తల్లిదండ్రులతో పాటూ సోదరిని హత్య చేసినట్లు తేల్చారు. పక్కా ప్లాన్ ప్రకారం కుటుంబం మొత్తాన్ని దారుణంగా హత్య చేసి తనకేం పాపం తెలియదన్నట్లు నాటకాలాడాడు ఆ నరరూప రాక్షసుడు. అనుమానం వచ్చిన ఖాకీలు అతడ్ని పిలిచి తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. విచారణలో అతడు చెప్పిన నిజాలు విని పోలీసులే నివ్వెరపోగా.. హత్య చేయడానికి చెప్పిన కారణాలు విని షాక్ తిన్నారట. పోలీసులు వివరాల ప్రకారం ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో మిథిలేష్ భార్య సియా, కూతురు నేహా, కుమారుడు సూరజ్‌లతో కలిసి ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సూరజ్ కాలేజీకి వెళ్లకుండా డుమ్మా కొడుతున్నాడు.
స్నేహితులతో తిరుగుతూ గాలి పటాలు ఎగురవేస్తున్నాడు. కొడుకు తీరు నచ్చని మిథిలేష్ రెండు మూడుసార్లు హెచ్చరించాడు పద్దతి మార్చుకోవాలని చెప్పాడు. ఓసారి పరిస్థితి సూరజ్‌పై తండ్రి చేయి చేసుకునే వరకు వెళ్లింది. తండ్రి కొట్టడంతో అతడు పగ పెంచుకున్నాడు. తండ్రిపై కక్ష పెంచుకున్న సూరజ్ రగిలిపోయాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. బుధవారం వేకువజామున గాఢ నిద్రలో ఉన్న తండ్రి మిథిలేష్‌పై కత్తితో దాడి చేశాడు. గుండె, కడుపు భాగంలో 8సార్లు పొడిచాడు. తర్వాత మరో గదిలో నిద్రిస్తున్న తల్లి సియా దగ్గరకు వెళ్లి ఆమెను ఏడు పోట్లు పొడిచాడు. అనంతరం తన సోదరి నేహ ఉన్న గదిలోకి వెళ్లి ఆమెను నాలుగు పోట్లు పొడిచాడు. ముగ్గురి ప్రాణాలు పోయాక ఈ హత్య కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ వేసుకున్నాడు.
వేకువజామున 5.30గంటల ప్రాంతంలో ఇరుగుపొరుగువారిని అప్రమత్తం చేశాడు. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు.. తమ ఇంట్లో చొరబడి తన తల్లిదండ్రులు, సోదరిని చంపేశారని కట్టు కథ అల్లాడు. తనను తానే గాయపరుచుకొని దుండగుల నుంచి తప్పించుకున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. నిజమేనని నమ్మిన పోలీసులు ముందు అతడిపై అనుమానం వ్యక్తం చేయలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇరుగు పొరుగువారిని ప్రశ్నించి మిథిలేష్ కుటుంబానికి ఎవరితో వివాదాలు లేవని తెలుసుకున్నారు. బుధవారం సాయంత్రం సూరజ్ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు అతడ్ని తీసుకెళ్లి ప్రశ్నించారు. అప్పుడు అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన తల్లిదండ్రులు, సోదరిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. తన తండ్రి చేయి చేసుకున్నందుకు కోపంతో ఆయన్ను చంపానని విషయం తెలిసిపోతుందని తల్లి, చెల్లిని కూడా హతమార్చినట్లు ఒప్పుకున్నాడు