Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా పోటీచేసేది తానే అని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టత నిచ్చాక… ఇక ఆయన అధ్యక్ష పదవి కూడా చేపడతారని వార్తలొస్తున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన వెంటనే రాహుల్ గాంధీ నాయకత్వంపై అందరికీ సందేహాలు కలిగాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ ను ముందుండి నడిపించే సత్తా రాహుల్ కు లేదన్న వాదనలు వినిపించాయి. కాంగ్రెస్ లో తిరిగి జవసత్వాలు నింపడానికి ప్రియాంక గాంధీ రావాలని, పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించాలన్న డిమాండ్ అంతర్గతంగా పార్టీలో బయలుదేరింది. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం పార్టీ అంతర్గత వాదనల ప్రభావానికి లోను కాలేదు. కారణం తెలియదు కానీ తొలినుంచి సోనియాగాంధీ తన వారసుడిగా రాహుల్ గాంధీనే భావిస్తున్నారు. రాహుల్ రాజకీయప్రవేశం నుంచి ఆమె పార్టీ శ్రేణులకు ఈ సంకేతాలే ఇస్తున్నారు.
కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రియాంక గాంధీ అప్పుడప్పుడు అన్న. తల్లి నియోజకవర్గాల్లో పర్యటించడం, నానమ్మ, తండ్రి, వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో వారికి నివాళులర్పించడం మినహా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడం లేదు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే… కాంగ్రెస్ దిక్సూచి రాహుల్ గాంధీనే అని చెప్పొచ్చు. ఆయన కూడా పార్టీ కార్యకలాపాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. సోనియాగాంధీ హయాంలో అధికారం చెలాయించిన సీనియర్లందరినీ పక్కకుబెట్టి… తన అనుయాయులకు రాహుల్ పార్టీ పదవులు కట్టబెడుతున్నారు. వృద్ధ నాయకత్వం నుంచి యువనాయకత్వంలోకి మారే సంధి దశలో కాంగ్రెస్ ఉంది.
ప్రస్తుతం సోనియాగాంధీ అధ్యక్షురాలిగా కనిపిస్తున్నప్పటికీ… తెర వెనక రాహుల్ గాంధీనే పవర్ ఫుల్ నేతగా ఉన్నారు. త్వరలోనే అధికారికంగానూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకాల మూడో సంకలనం విడుదల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా గాంధీ ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. చాలా కాలంగా అందరూ రాహుల్ గాంధీ అధ్యక్షపదవి గురించి తనను అడుగుతున్నారని, ఇక అదే జరగనుందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ మాత్రం దీని గురించి స్పందించలేదు. రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చించేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ కు బాధ్యతలు అప్పగించాలంటూ తీర్మానాలు చేశాయి. కొత్త పీసీసీ అధ్యక్షులు, పార్టీ కేంద్ర కమిటీల ఎంపిక తర్వాత అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అన్నీ అనుకున్నట్టుగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు స్వీకరిస్తే… నెహ్రూ, గాంధీ కుటుంబంలో నాలుగో తరం కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నట్టు అవుతుంది.