తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాకతో తెలంగాణ ఎన్నికల సమరం వేడెక్కింది. శుక్రవారం సాయంత్రం మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభ ఆ పార్టీకి మరింత ఊపిరి ఊదింది. దేశంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాంలలో శాసనసభల ఎన్నికలు జరుగుతున్నా ఆయా రాష్ట్రాలకు కనీసం పట్టించుకోని సోనియా ప్రత్యేకించి తెలంగాణకు రావడం ఇక్కడి ఎన్నికల ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడం ద్వారా సోనియా గాంధీ తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు.
అదే విధంగా తన ప్రసంగంతో కూడా ఆకట్టుకున్నారు. తెలంగాణ వచ్చింది. నేను మీ అందరి మధ్య ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినప్పుడు కలిగినంత సంతోషాన్ని అనుభవిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో నాకు గుర్తుంది. అదంత సులభమైన పని కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి బాగోగులూ మేమే చూడాల్సి ఉండేది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉద్యమ స్ఫూర్తిని గమనించి నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని తెలంగాణ కలను సాకారం చేశాం. రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని ఆ రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో, ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తీరుతామని సోనియా ప్రకటించారు.
ఇది హైదరబాదులో ఉన్న ఆంధ్ర సెటిలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే తాను తెలంగాణాకు రావడం బిడ్డ దగ్గరకు తల్లి వచ్చినట్లుగా ఉందని సోనియా గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజలను ప్రభావితం చేస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తాము తెలంగాణ ఇచ్చామని చెప్పడం కంటే మీ పోరాటాల కారణంగానే తెలంగాణ వచ్చిందని సోనియా గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటన కూడా తెలంగాణ వాసులలో ఆలోచనలు రేకెత్తిస్తుందని మహాకూటమికి ఓటు వేసే దిశగా దీని ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మేడ్చల్ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణులలో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పాడ్డాయి.
ఈ ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంది. ఇప్పుడు సోనియా రాకతో తెలంగాణలో శీతాకాలంలో ఎన్నికల వేడిగాలులు వీస్తున్నాయి. సోనియా సభకు భారీ ఎత్తున ప్రజలు రావడం, సోనియా ప్రసంగానికి అడుగడుగునా నీరాజనాలు పలకడం కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచింది. రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు వైపే మొగ్గు చూపామని సోనియా ప్రకటించడం తెలంగాణ వాసులలో ఓ చర్చకు దారి తీసింది. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దేవుడైందని, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ దేవతగా టిఆర్‌ఎస్ నాయకులకు కనిపించిందని, ఇప్పుడు మాత్రం అదే పార్టీ అదే మనిషి దెయ్యంలా కనిపిస్తోందనడం వారి దిగజారుడుతనమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ముందస్తు ఎన్నికలలో మహాకూటమి తన అభ్యర్దులను గెలిపించే దిశగా తమ ప్రచారాన్ని మరింత పెంచింది.