Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ కెప్టెన్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఎలాంటి చరిత్ర సృష్టించాడో అందరికీ తెలిసిందే. భారత క్రికెట్ కెప్టెన్ కు గంగూలీ అసలు సిసలు నిర్వచనం ఇచ్చాడు. కెప్టెన్ గా భారత్ కు ఎన్నో విజయాలను అందించడమే కాకుండా జట్టుకు దూకుడు నేర్పాడు. సహచరుల్లో ఆత్మవిశ్వాసం పెంచాడు. భారత క్రికెట్ ను గంగూలికి ముందు, గంగూలీ తర్వాత అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అలా విజయవంతమైన సారధిగా కొనసాగుతున్న గంగూలీ కెప్టెన్సీ కోల్పోవడానికి, తర్వాత రోజుల్లో ఆయన జట్టులో చోటు కోల్పోవడానికి 2005లో భారత్ కు కోచ్ గా ఉన్న గ్రెగ్ ఛాపెల్ కారణం. ఛాపెల్ తో విభేదాలే గంగూలీ కెప్టెన్సీని, కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టాయి. నిజానికి గంగూలీతో ఉన్న స్నేహం వల్లే ఛాపెల్ భారత్ కోచ్ కాగలిగాడు. కానీ తర్వాతి రోజుల్లో పరిణామాలు మారిపోయాయి.
జట్టు సెలక్షన్ మొదలు అనేక అంశాల్లో గంగూలీకి, ఛాపెల్ కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. 2005 సెప్టెంబర్ లో గంగూలీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. జింబాబ్వే టెస్ట్ లో సెంచరీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన గంగూలీ ఛాపెల్ తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నాడని చెప్పడం పెను దుమారం రేపింది. కోచ్, కెప్టెన్ విభేదాలు బయటపడడం, అప్పటికే గంగూలీ వ్యవహారశైలిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో బీసీసీఐ గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తర్వాతి రోజుల్లో వన్డే జట్టులో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చింది గంగూలీ. 2007 వరల్డ్ కప్ నాటికి జట్టులో `చోటు దక్కించుకున్నప్పటికీ…పునర్ వైభవం మాత్రం సాధించలేకపోయాడు . 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంటే సరిగ్గా చెప్పాలంటే ఛాపెల్ తో విభేదాల వల్ల గంగూలీ కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా క్రికెట్ కే దూరం కావాల్సి వచ్చింది. ఇది జరిగి దశాబ్దకాలం దాటినా ఇప్పటికీ….ఛాపెల్ ను మర్చిపోలేకపోతున్నాడు గంగూలీ.
క్రికెట్ చరిత్ర కారుడు బోరిజా రాసిన ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్ పుస్తకంలో గ్రెగ్ ఛాపెల్ తో తన విభేదాల గురించి పెదవి విప్పాడు గంగూలీ. తన కెరీర్ ను సర్వనాశనం చేయాలని భావించిన చాపెల్ ను తానింకా మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. ఓ రోజు సాయంత్రం గ్రెగ్ నా వద్దకు వచ్చాడు. టెస్ట్ మ్యాచ్ కు సెలెక్ట్ చేసిన జట్టును నాకు చూపించాడు. ఆయన చూపించిన జట్టులో కీలకమైన ఆటగాళ్లు లేని విషయాన్ని గుర్తించాను. ఆయనేం చేయబోతున్నాడో అప్పుడు నాకు అర్ధమయింది. సెప్టెంబర్ 2005లో బులవాయాలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు జింబాబ్వే టూర్ మొదట్లోనే ఏదో జరగబోతోందన్న విషయం నాకు అర్ధమయింది. చాపెల్ కు దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు లేనిపోనివి చెప్పారు. చాలా విషయాల్లో ఛాపెల్ తో నేను విభేదించాను. ఛాపెల్ సలహాలను అనేక సార్లు తిరస్కరించాను.
ఇండియన్ క్రికెట్ కు మీరేదో చేస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అదే చేయండి అని ఛాపెల్ తో స్పష్టంగా చెప్పాను. ఒకరోజు ఛాపెల్ నా వద్దకు వచ్చి పెద్దగా అరిచాడు. ఛాపెల్ తన టీం ను సిద్దంచేసుకుంటున్నట్టు నాకు అనిపించింది. . ఒకానొక సమయంలో మోకాలి గాయంతో కూడా ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ సారి జట్టు లో నాపేరు కనిపించలేదు. నా కెరీర్ కు చెక్ పెట్టేందుకు ఛాపెల్ ప్రయత్నిస్తున్నట్టు అర్ధమయిందిఅంటూ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకున్నాడు సౌరవ్ గంగూలీ. చాపెల్ సౌరవ్ విదాదంతో పాటు… మైదానం వెలుపలి అనేక విషయాలను తెలియజేస్తున్న ఈ 500 పేజీల పుస్తకాన్ని ఐపీఎల్ సందర్భంగా విడుదల చేయనున్నారు. సిమన్ అండ్ షస్టర్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.