Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంజాన్ అనగానే ముస్లింల ప్రార్థనలతో పాటు గుర్తొచ్చేది హలీమ్, ఇఫ్తార్ విందులు, ఖర్జూరాలు, సేమ్యా వంటకం షీర్ ఖుర్మా. ముస్లింల ప్రత్యేక మాసం రంజాన్.లో ఓ పక్క ఉపవాసదీక్షలు జరుగుతుంటాయి. మరో పక్క రుచికరమైన వంటకాలు నోరూరిస్తుంటాయి. పగలంతా ఉపవాస దీక్షలో గడిపే ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత వివిధ రకాల రుచికరమైన వంటలతో భోజనం చేయడమే ఇందుకు కారణం. ముఖ్యంగా హలీమ్ రంజాన్ మాసంలో ముస్లింలనే కాదు…అన్ని వర్గాల వారికీ నోరూరించే వంటకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో నిస్సత్తువుగా ఉండేవారికి హలీమ్ తక్షణ శక్తినిస్తుంది. తక్కువ సమయంలో జీర్ణమై ఎక్కువశక్తిని అందించే హలీం మంచి బలవర్థక ఆహారం కూడా. మటన్, గోధుమలు కలిపి చేసే హలీమ్ రుచిని ఆరగించడానికి అందరూ పోటీపడుతుంటారు.
హరీస్ అనే మరో వంటకం కూడా రంజాన్ సందర్భంగా ప్రసిద్ధి పొందింది. చికెన్, గోధుమలు ప్రధానంగా వాడి బాగా ఉడికించి ఈ వంటకాన్ని చేస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేకంగా తీసుకునేవాటిలో ఖర్జూరా ఒకటి. సూర్యాస్తమయం తర్వాత ముస్లింలు ఖర్జూర పండు తిని ఉపవాసదీక్ష విరమిస్తారు. ముస్లింలు ఈ మాసంలో ఖర్జూరాలను అందరికీ పంచుతుంటారు. ఇక రంజాన్ సందర్భంగా చేసుకునే తీపి వంటకం షీర్ ఖుర్మా రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సన్నని సేమ్యా, పాలు, పంచదార,నెయ్యి, బాదంపప్పు, పిస్తా పప్పు,చిరోంజి గింజలు, ఖర్జూరం, కుంకుమపువ్వు, కిస్ మిస్, జాజికాయ పొడి,యాలకుల పొడి వంటివి వేసి తయారుచేసే షీర్ ఖుర్మా…
రంజాన్ మాసపు ప్రత్యేకం. ఇవేకాదు…రుమాలీ రోటీ, ఖుబానీకా మీఠా, డబుల్ కా మీఠా, గాజర్ కా మీఠా వంటి వంటకాలు కూడా రంజాన్ రుచులుగా పేరుగాంచాయి. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఇఫ్తార్ విందులు. ఈ విందు మతసామరస్యానికి ప్రతీకగా భావించవచ్చు. రాజకీయాలకు అతీతంగా కూడా ఈ విందు సాగుతుంటుంది. అన్ని మతాల వారూ ఈ విందులో పాల్గొంటారు.రాజకీయపార్టీలన్నీ ఇఫ్తార్ విందులు ఇస్తుంటాయి. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుతో రాజకీయవాతావరణం ఆహ్లాదంగా మారిపోతుంది.