సొంతగడ్డపై రెచ్చిపోయిన ఆడిన టీమిండియా, విదేశీ గడ్డపై ఘోరంగా ఓడింది. రెండో టీ20లో టీమిండియా ను దక్షిణాఫ్రికా ఓడించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో తోలుత సూర్యకుమార్, రింకూ సింగ్ ల హాఫ్ సెంచరీలతో భారత్ 19.3 ఓవర్లలో 180 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆపై ఆకస్మాత్తుగా వర్షం రావడంతో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు.
ఈ టార్గెట్ ని సఫారీలు 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. 152 పరుగుల లక్ష్యాన్ని 90 బంతుల్లో చేదించిన దక్షిణాఫ్రికా జట్టు తొలి బంతి నుంచే పటిష్టమైన శుభారంభం చేసింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్ లో 14 పరుగులు రాగా, అర్షదీప్ సింగ్ ఓవర్ లో 24 పరుగులు వచ్చాయి. కేవలం రెండు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా స్కోర్ 38 పరుగులకు చేరుకుంది. దీని తర్వాత ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ వెనుతిరిగి చూడలేదు. వేగంగా పరుగులు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.