Sports : హార్దిక్ పాండ్య ఐపీఎల్ లో తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడా?

Sports: Will Hardik Pandya return to Mumbai in IPL?
Sports: Will Hardik Pandya return to Mumbai in IPL?

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐపీఎల్లో తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడా? గుజరాత్ టైటాన్స్ సారథ్యాన్ని అతడు వదులుకోవడానికి సిద్ధమయ్యాడా? తొలి సీజన్లో తమకు ట్రోఫీ అందించిన కెప్టెన్ను విడిచిపెట్టేందుకు గుజరాత్ అంగీకరించిందా? ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో మరొక్క రోజులో ముగుస్తుందనగా హార్దిక్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడు ముంబయి ఇండియన్స్ కు వెళ్లనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అటు గుజరాత్ టైటాన్స్ గానీ.. ముంబయి ఇండియన్స్ గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఆదివారం వరకు గడువుంది. అప్పటివరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేనట్లే. పాండ్య ఏడేళ్లు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. 2022 సీజన్ ముందు ముంబయి వదులుకోగా.. అతడిని సొంతం చేసుకున్న గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలూ అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో వరుసగా రెండేళ్లు గుజరాత్ ఫైనల్ చేరింది.

తొలి ఏడాది టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఈ ఏడాది చెన్నై చేతిలో పరాజయం పాలైంది. ‘‘హార్దిక్ ముం బయికి మారడం పై చర్చలు జరిగాయి. అతడు ఫ్రాంఛైజీ మారే అవకాశముంది. ఇంకా ఒప్పందం పూర్తికాలేదు’’ అని గుజరాత్ టైటాన్స్ వర్గాలు తెలిపాయి. ట్రేడింగ్లో భాగంగా రెండు జట్లు పరస్పరం ఆటగాళ్లను మార్చుకుంటాయి. మరి పాండ్యకు బదులుగా ముంబయి ఎవరిని పంపనుందనే దానిపైనా ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ హార్దిక్ ముంబయికి తిరిగొస్తే.. అతడు రోహిత్ సారథ్యంలో ఆడతాడా.. లేదంటే అతడే కెప్టెన్గా ఉంటాడా అన్నది ఆసక్తికరమే. హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశముంది. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ శార్దూల్ ఠాకూర్, లోకి ఫెర్గూసన్, టిమ్ సౌథీలను వదులుకునేందుకు సిద్ధమైందని సమాచారం. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లోనే అత్యం త ఖరీదైన ఆటగాడు సామ్ కరన్ను విడిచిపెట్టాలని నిర్ణయించిందట. డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూ పీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది.

డిసెం బర్ 9న ముంబయిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి లో డబ్ల్యూ పీఎల్ సీజన్-2 ఆరంభం కానున్న నేపథ్యంలో వేలం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ జట్లు ఇప్పటికే 60 మంది క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 21 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 29 మందిని ఫ్రాంఛైజీలు విడిచిపెట్టాయి. వీరు వేలంలోకి రానున్నారు. ఫ్రాంఛైజీలు వదులుకున్న క్రికెటర్లలో తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (గుజరాత్) కూడా ఉంది. అంజలి శర్వా ణి (యూపీ), అరుంధతి రెడ్డి (దిల్లీ) వచ్చే సీజన్లో సొంత జట్లకే ఆడనున్నారు. ఈ ఏడాది జరిగిన తొలి డబ్ల్యూపీఎల్ టోర్నీలో దిల్లీపై నెగ్గి ముంబయి విజేతగా నిలిచింది.