శివార్చనే లోకం… శివ సన్నిధే పరమావధి అనుకునే ఆయన శివసన్నిధిలో మోక్షం పొందాడు… తనువు చాలించే వరకూ పరమేశ్వరుని సేవలోనే తరించాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు… రుద్రుని ఆనతి లేకుండా కాలుడైనా కబళించడంటారు… మరి ఆ శివయ్యే అనుమతిచ్చాడో లేదా తన దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడో తెలియదు కానీ… ఓ పూజారి శివ సన్నిధిలోనే కుప్పకూలిపోయాడు… తాను నిత్యం పూజించే పరమేశ్వరుడి పాదాల ముందే ఒరిగిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర ఆలయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు కందుకూరి వెంకటరామారావు స్వామివారికి పూజలు చేస్తూ శివలింగంపైనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు.
వెంకటరామారావు పూజలు నిర్వహిస్తూ ఉండగా కుప్పకూలిన దృశ్యాలు చూసినవారిని కలవరానికి గురిచేస్తున్నయి. మొదట ఓసారి ఆయన పడిపోయారు. సహ అర్చకుడు వచ్చి ఆయనను లేపి నిల్చోబెట్టారు… తోటి పూజారులు, కొడుకు, భక్తులు అందరూ చూస్తుండగానే ఆయన శివలింగం మీదే ఒరిగిపోయారు… సహ అర్చకులు అక్కడికి చేరుకొని రామారావు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా… ఫలితం లేకపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గుడిలోని అర్చకులంతా కలిసి ఆయనను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరామారావు మృతి చెందారని తెలుస్తోంది. గర్భగుడిలోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈనెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆలయంలో ఎవరైనా మృతి చెందితే.. శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ వంటి క్రతువు చేయాలి. అయితే పూజారి రామారావుకు గుండెపోటు వచ్చిన వెంటనే బయటకు తీసుకొచ్చామని.. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందారని ఆలయ ఈవో, పూజారులు చెబుతున్నారు. అయితే పూజారి ఆలయంలోనే మృతి చెందాడని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది కేవలం తప్పుడు ప్రచారమేనంటున్నారు అధికారులు. వెంకటరామారావు 40ఏళ్లుగా ఇదే ఆలయంలో సేవలు అందిస్తున్నారు.