Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sri Venkateswara Brahmotsavam From 22nd September
భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలను టీటీడీ ప్రకటించింది. దసరా సమయంలో ఏటా తిరుమల వేంకటేశ్వరునికి వార్షిక బ్రహ్మోత్సవాలు చేయటం ఆనవాయితీ. ఎప్పటిలానే ఈ సారి బ్రహ్మాండనాయకుడు బ్రహ్మోత్సవ శోభకు ముస్తాబవుతున్నాడు. ఈ నెల 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆ మరుసటిరోజు 23న రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అనంతరం రాత్రి తొమ్మిదిగంటలకు పెదశేష వాహనంపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత రోజు నుంచి ఉదయం, సాయంత్రం అఖిలాండనాయకుడికి రెండు వాహన సేవలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహన సేవ ఈ నెల 27వ తేదీ రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. శ్రీవేంకటేశ్వరుడు గరుడ వాహనంపై మాడవీధుల్లో తిరిగే దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తుతారు. గరుడ వాహనసేవకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని చర్యలూ తీసుకున్నామని టీటీడీ తెలిపింది. ఈ నెల 30న స్వామి వారికి రథోత్సవం జరగనుంది. అక్టోబరు 1న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. పదిరోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.