ఢిల్లీలో చంద్రబాబు దీక్షా శిబిరం వద్ద వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చంద్రబాబు దీక్ష చేస్తోన్న ఏపీ భవన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతడు తెలుగులో సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కేంద్రం వైఖరితో విసిగిపోయే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు అతడు రాసిన లేఖను గోప్యంగా ఉంచడం వివాదానికి తావిస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన దివ్యాంగుడ దావల అర్జున రావు (40)గా అధికారులు గుర్తించారు. ధర్మ పోరాట వేదిక నుంచి మాట్లాడిన సీఎం చంద్రబాబు అర్జున్ రావు ఆత్మహత్య ఘటన పట్ల దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ భవన్ సిబ్బంది ఈరోజు తెల్లరుజామున ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. చక్రాల కుర్చీలో మృతిచెందిన అతడి వద్ద ఒక లేఖ లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆ పక్కనే చిన్న బాటిల్, రూ.20 నోటును పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అర్జున్ రావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కేంద్రం వైఖరితో విసిగిపోయే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అర్జున రావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన కొంత మంది అధికారులు చెబుతుండటం గమనార్హం.