Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : రజత్ కృష్ణ , నేహా హింగే , రాజీవ్ కనకాల , హేమ
నిర్మాత : సునీత , రాజ్ కుమార్ బృందావన్
దర్శకత్వం : విజయేంద్ర ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ
కధా రచయితగా ఒక్క తెలుగు లోనే గాకుండా యావద్ భారతదేశంలో మంచి డిమాండ్ వున్న విజయేంద్ర ప్రసాద్ మెగా ఫోన్ పట్టాడంటే ఆ కధలో ఏదో విశేషం వుండి ఉంటుందని అనుకోవడం సహజం. ఇంతకుముందు ఆయన దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 2008 , రాజన్న సినిమాలు చూసిన వారికి శ్రీవల్లి మీద గట్టి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు శ్రీవల్లి రీచ్ అయ్యిందో,లేదో పరిశీలిద్దాం.
కథ…
శ్రీవల్లి ( నేహా హింగే) ఓ ప్రఖ్యాత శాస్త్రవేత్త రామచంద్ర ( రాజీవ్ కనకాల) కుమార్తె. చిన్నప్పటి నుంచి ఆమెకి బాల్య స్నేహితుడు గౌతమ్ తో పాటు సొంత తమ్ముడు కి బాగా సన్నిహితంగా మెసులుతుంది. ఆ తర్వాత తండ్రి,సోదరుడితో సహా ఆమె అమెరికా వెళ్ళిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఆమె కుటుంబంతో సహా ఇండియా వస్తుంది. ఆమె తండ్రి రామచంద్ర తో కలిసి 6000 వేల కోట్లతో శాస్త్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఓ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. అయితే అనుకోకుండా ఓ ప్రమాదంలో ఆమె తండ్రి చనిపోతాడు.శ్రీవల్లి సోదరుడు అదే ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళతాడు.
సోదరుడిని మాములు స్థితికి తీసుకురావడానికి ఆమె ఓ ప్రొఫెసర్ సాయంతో బ్రెయిన్ మాపింగ్ అనే ఓ ప్రయోగం చేస్తుంది. దీంతో శ్రీవల్లి ఏ మనసులోకి అయినా వెళ్లి చూసే సామర్ధ్యం సొంతం అవుతుంది. ఆ స్పెషల్ శక్తిని ఆసరా చేసుకుని తమ్ముడిని కోమా నుంచి బయటకు రప్పిస్తుంది. అయితే ఈ శక్తి వల్ల ఆమెకి పూర్వజన్మలో జరిగిన విషయాలు కూడా గుర్తుకు వస్తుంటాయి. అందులో ఆమె ప్రతి రోజు ఓ వ్యక్తితో శృంగారం నెరపడం పదేపదే మదిలోకి వస్తుంటుంది. మరో వైపు హోమో సెక్సువల్ అయిన ఆండ్రియా అనే అమ్మాయి శ్రీవల్లిని వేదిస్తుంటుంది. బ్రెయిన్ మాపింగ్ ప్రభావంతో జన్మల మధ్య తేడా చెరిగిపోయి ఏది ప్రస్తుతం , ఏది గతం అనేది గుర్తించలేని పరిస్థితుల్లోకి వెళుతుంది శ్రీవల్లి. శ్రీవల్లి ని వేధిస్తున్న ఆ గత జన్మ రహస్యం ఏంటి, గౌతమ్ కి అందులో సంబంధం ఉందా , చివరకు శ్రీవల్లి జీవితం ఏమైంది అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ…
సైంటిఫిక్ థ్రిల్లర్, భావ తరంగాల ద్వారా వేరే వ్యక్తి మనసులోకి వెళ్లగలగడం వంటి విషయాలు ఈ సినిమా ప్రమోషన్ లో విన్నప్పుడు ఏదో కొత్త కథ చెప్పబోతున్నారు అనిపించింది. పైగా కధకుడు, దర్శకుడు విజయేంద్రప్రసాద్. కానీ జన్మలు, ఆత్మలు వంటి అంశాలకి కధలో ప్రాధాన్యం ఉన్నందున సైన్స్ అనే మాటని వాడుకున్నారు తప్ప కొత్త్తగా చెప్పిందేమీ లేదు. కధనం, గ్రాఫిక్స్ ఇలా ఏది చూసినా అంచనాలు,ట్రైలర్స్ కి తగ్గట్టు లేవు. ఓ అభిమానిగా చెప్పదలుచుకుంటే ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కధకుడు పాత్రకి పరిమితం అయితే బాగుండేది. అయితే ఇలాంటి సినిమాలో కూడా తనదైన ముద్ర వేసిన రాజీవ్ కనకాల నటన ప్రేక్షకుడితో పాటు ఇంటి దాకా వస్తుంది.
ప్లస్ పాయింట్స్ …
కథ
రాజీవ్ కనకాల
మైనస్ పాయింట్స్ …
మిగిలినవి అన్నీ
తెలుగు బులెట్ పంచ్ లైన్… శ్రీవల్లి కధగా చెప్పొచ్చు ,..సినిమా తీయకూడదు.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .25 / 5 .