భాగ్యనగరవాసులకు ఐకియా ఫీవర్ పట్టుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో స్వీడన్ దిగ్గజ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల్లో ఫర్నీచర్ షోరూమ్ ను ఐకియా సంస్థ ఏర్పాటుచేసింది. మొత్తం 7వేల 500 ప్రొడక్ట్స్ ను అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీంతో పాటు వెయ్యి సీట్లతో అతిపెద్ద రెస్టారెంట్ ఐకియా స్టోర్ లో ఉంది. ఆహ్లాదకరంగా.. పిల్లలు ఆడుకునే ప్లే జోన్ కూడా ఉంది.
ఇక అందరూ హైటెక్ సిటీలోని ఐకియా స్టోర్ వైపు పరుగులెడుతున్నారు. అక్కడ రద్దీ చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. తిరుమలలో కంపార్ట్‌మెంట్ గేటు తెరవగానే బాలాజీ దర్శనానికి భక్తులు ఎగబడ్డట్టుగా జనం పోటెత్తారు. బిల్లింగ్ కోసం ఒక్కొక్కరూ సుమారు 4 గంటల పాటు క్యూ కట్టారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐటీ సంస్థలకు నెలవైన హైటెక్ సిటీ పరిధిలోని రహదారులన్నీ కిక్కిరిసిన వాహనాలతో కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రారంభించిన మొదటి రోజే వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ స్వీడిష్ ఫర్నిచర్ దిగ్గజం యాజమాన్యం తెగ సంబరపడిపోతోంది.
ఇక భారీగా జనాలు ఎగబడటంతో షోరూమ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కస్టమర్లను కంట్రోల్ చేయలేక ఐకియా సిబ్బంది చేతులెత్తేసింది. ఒకర్నొకరు తోసుకోవడంతో కొందరు కస్టమర్లు కిందపడిపోయారు. దీంతో అక్కడ చాలా సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. అయినా జనాల పిచ్చి కానీ అక్కడేమన్నా ఊరికే పంచి పెడుతున్నారా ? విరగబడి వెళ్లి రావడానికి !