వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం నిల్వలను పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికిప్పుడు సమకూర్చలేమని, మరో నెల రోజుల గడువు కావాలని కేంద్రానికి లేఖ రాసింది. జూన్ నుంచి వానాకాలం మొదలవుతుందని, పేద ప్రజలకు ఆహారధాన్యాలు చేరవేయడం ఇబ్బందిగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం కోటాను జూన్‌లోనే అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మూడు నెలల కోటాను సర్దుబాటు చేయటం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్‌లో ఒక నెల కోటా, జూలైలో రెండు నెలల కోటాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.