ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుంది అని అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతారని తెలిపారు. రికార్డు సృష్టించేలా యోగా డే నిర్వహిస్తామన్నారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. ‘మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర-2025 పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. యోగా మన దేశానికి వారసత్వంగా వస్తోంది. భారతీయ జీవన విధానంలో ఇది ఒక భాగం. మోదీ కృషి వల్ల 2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచమంతా యోగా దినోత్సవం జరపాలని తీర్మానించారు. యోగా ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినది కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరుపుకొనే కార్యక్రమం. పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనివార్యంగా మారుతోంది. ఒత్తిడికి యోగా ఒక్కటే మందు. ప్రపంచ రికార్డు సృష్టించేలా నేటి నుంచి యోగాంధ్ర-2025 పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తాం.