మహాకూటమి టికెట్ కష్టాలు ఇంకా తీరానట్టేనా…?

Still No Clarity Of Tickets In Mahakutami

మహాకూటమిలోని ఆందోళన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణాలో ఎన్నికలకు కనీసం ఒక నెల గడువు కూడా లేకున్నా, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా, మహాకూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్టులేదు. ఇప్పటికే తెరాస పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం ముమ్మరం చేస్తుంది. వాటికి తగిలే ఎదురుదెబ్బలు వారికి తగులుతూనే ఉన్నాయి అది వేరే విషయం అనుకోండి.

trs

కానీ, ఇక్కడ మహాకూటమికి వచ్చిన చిక్కల్లా సీట్ల సర్దుబాటు అనగా టిక్కెట్ల కేటాయింపు. ఈ అభ్యర్థుల ప్రకటనలో జరుగుతున్న జాప్యం దృష్ట్యా, తమకు టిక్కెట్లు కేటాయించాలని మహాకూటమిలోని కాంగ్రెస్ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. తమకు కచ్చితంగా టిక్కెట్లు కేటాయించాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేస్తుండగా, ఇంకొందరు కాంగ్రెస్ నేతలు నేరుగా ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసం ముందు తిష్ట వేసి తమ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

Rahul Gandhi

గతంలో ఎంపీ గా పనిచేసిన రవీంద్ర నాయక్ రాబోవు తెలంగాణ ఎన్నికల్లో తనకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని లంబాడి మహిళలను వెంటేసుకొని, బస్సులో వెళ్లి మరీ రాహుల్ గాంధీని ఢిల్లీ లోని ఆయన నివాసం వద్ద కలుసుకున్నారు. తాను దేవరకొండ నుండి నిలబడాలనుకుంటున్నట్లుగా, అక్కడ తనకి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని రాహుల్ గాంధీ కి విన్నవించారు. మరోవైపు అశోక్ గౌడ్ కూడా వరంగల్ అసెంబ్లీ టిక్కెట్ విషయమై ఢిల్లీలో కూర్చున్నాడు. అభ్యర్థుల ప్రకటన విషయంలో తర్జనభర్జనలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కుంతియాలు ఈరోజు మధ్యాహ్నం గంటకు పైగా రాహుల్ గాంధీ తో చర్చలు జరిపారు. ఇదికాకుండా తమ సీట్ల లెక్క ముందుగా తేల్చాలని కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో మహాకూటమి తమ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది.