Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేస్తారనేదానిపై నిన్నటినుంచి కొనసాగుతున్న అస్పష్టత మార్కెట్లను నష్టాలపాలుచేసింది. మంగళవారం వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించే దిశగా దూసుకుపోయినప్పడు లాభాలు నమోదుచేసిన స్టాక్ మార్కెట్లు… చివరకు హంగ్ ఫలితాలు వెల్లడవడంతో నష్టాల్లో ముగిశాయి. ఆ నష్టాలను ఇవాళంతా కొనసాగించాయి.
ఉదయం దాదాపు 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరిదాకా నష్టాల్లోనే కొనసాగింది. 156.06 పాయింట్ల నష్టంతో 35,387.88వద్ద ముగిసింది. 54 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ కూడా రోజంతా నష్టాల్లోనే ఉంటూ 10741.10 వద్ద 60.80 పాయింట్ల నష్టంతో స్థిరపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, గెయిల్, రిలయన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు నమోదుచేశాయి. పీఎస్ బీ, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంచురీ ప్లేబోర్డ్స్ , మోరెపన్ ల్యాబ్స్, అదానీ ట్రాన్స్ మిషన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, శక్తి పంప్స్ కంపెనీల షేర్లు దాదాపు 16శాతం పడిపోయాయి. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తే తప్ప మార్కెట్లు లాభాలబాట పట్టే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు.