వీళ్లు ఎవరో కానీ మామూలు దొంగలు కాదు. మహా ముదురు దొంగలు. దొంగ నా దొంగలు. గుడిలో లింగాన్నే కాదు గుడినే మింగేసే బాపతు అంటారు కదా. ఈళ్లు అలాంటి వాళ్ళే వల్లేఅనుకోవాలి మనం. ఎవడన్నా ఏటీఎంలో దొంగతనం చేశాడంటే నిజమే కాబోలు అనుకుంటాం. ఎందుకంటే ఇట్టాంటివీ చానా చూశాం కాబట్టి. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకు దొబ్బారు గజ దొంగలు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సాయుధ పోలీసు కార్టర్లను ఆనుకుని ఉన్నఎస్‌బీఐ ఏటీఎం యూనిట్ (మిషన్)ను శుక్రవారం అర్ధరాత్రి కొందరు దుండగులు అపహరించుకు పోయారు. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన కస్టమర్లు.. ఏటీఎం మిషన్ కనిపించకపోవడంతో షాక్ తిన్నారు. మిషన్ రిపేర్ చేయించడానికి తీసుకెళ్లారని భావించిన స్థానికులు ఎందుకైనా మంచిదని బ్యాంక్ సిబ్బందిని సంప్రదించారు. సీన్ కట్ చేస్తే బ్యాంక్ సిబ్బంది తమకేం తెలియదని సమాధానమిచ్చారు. దీంతో ఈ వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఏటీఎం లోపల సీసీ కెమెరాలు పగులగొట్టడం.. మిషన్‌ను తవ్వినట్లు ఆధారాలు కనిపించాయి. దీంతో ఇది దొంగల పనేనని నిర్థారించారు. ఏటీఎంలో బ్యాంకు అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. 8లక్షల 23వేల క్యాష్ ఉందంటున్నారు. ఏటీఎంలో డబ్బు చోరీ చేసేందుకు ప్రయత్నించి ఉంటారని.. కుదరకపోవడంతో మిషన్‌ను ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. మిషన్ ఎత్తుకెళ్లడం ఒకరిద్దరి వల్ల సాధ్యమయ్యే పని కాదని.. దొంగల ముఠా చేసిన చోరీగా చెబుతున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి.. ఏటీఎం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.