Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుపతి
శ్రీ పద్మావతి అమ్మవారు
కార్తీక బ్రహ్మోత్సవాలు
ప్రత్యేకవ్యాసం
అనంతాళ్వాన్‌కు కూతురైన వక్ష:స్థల మహాలక్ష్మి
తిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి పుష్పకైంకర్యం చేస్తూ సకుటుంబంగా చివరి వరకు జీవితాన్ని గడిపిన మహాభక్తుడు అనంతాళ్వాన్. ఈయన భగవద్రామానుజులకు సాక్షాత్తు శిష్యుడు.
స్వామివారి కైంకర్యం కోసం అవసరమైన పుష్పాల కోసం ఒక తటాకాన్ని తవ్వాలని తలపెట్టాడు. చాలా వ్యయ ప్రయాసలతో మట్టి పనిచేస్తున్న అనంతాళ్వాన్ దంపతులకు శ్రీవేంకటేశ్వరుడు కొంతసాయపడాలని భావించి 12 ఏళ్ల కుర్రవాడిగా వచ్చాడు.
అలాంటిదేమీ వద్దని, పిలవని పేరంటానికి రావద్దని కుర్రవాన్ని హెచ్చరించాడు. అప్పటికి వెళ్లిపోయిన శ్రీనివాసుడు మళ్లీ వచ్చి అనంతాళ్వాన్‌కు తెలియకుండా ఆయన భార్యకు మట్టిని మోసే పనిలో కొంతసాయం చేసేవారు. ఇది చూసిన అనంతాళ్వాన్ కోపంతో తన చేతిలోని గడ్డపారను ఆ కుర్రవానిపై విసిరారు. అది అతని గడ్డానికి గాయమైంది. అయినా అనంతాళ్వాన్ కోపం తగ్గకపోవడంతో ఆ కుర్రవాని వెంటపడ్డాడు. ఇంతలో ఆ పిల్లవాడు గుడిలోకి ప్రవేశించి మాయమయ్యాడు.
ఆ తర్వాత దర్శనానికి వెళ్లిన అనంతాళ్వాన్‌కు శ్రీనివాసుని గడ్డంపై రక్తం కారుతున్న గాయం కనబడింది. అనంతాళ్వాన్ నిశ్చేష్టుడై భోరున ఏడ్చాడు. ఇలాంటి అద్భుత సంఘటనలు అనంతాళ్వాను జీవితంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఆనాడు అనంతాళ్వాన్ చేసిన గడ్డం మీది గాయాన్ని ప్రీతిగా పచ్చకర్పూరంతో తీర్చిదిద్దుకుని తాను మురిసిపోతూ పరమపురుషుడైన శ్రీనివాసుడు మనల్ని మురిపింప చేస్తున్నాడు. ఆనాడు గాయం చేసిన గడ్డపారను మహద్వారం లోపల ఉత్తరం గోడకు పైభాగాన ఏర్పాటుచేశారు.
అనంతాళ్వాన్ పెంచుతున్న పూలతోటలో ఒక రోజు రాత్రి ఆనందనిలయుడు వక్ష:స్థలం మీది అలమేలుమంగతో కలిసి ప్రత్యక్షమయ్యారు. స్వామి, అమ్మవారు తోటంతా కలియతిరుగుతూ, ఇంచుమించుగా నాశనం చేసి సుప్రభాత సమయానికి ఆలయానికి చేరుకున్నారు.
తోటను నాశనం చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలని భావించి అనంతాళ్వాన్ ప్రతిరోజూ రాత్రి మాటు వేసేవాడు. తోటకు వస్తున్నది ఒక జంట అని తొమ్మిది రోజుల తరువాత గుర్తించాడు. మహిళను పట్టుకుని ఒక సంపెంగ చెట్టుకు కట్టేశాడు. పురుషుని కోసం వెతుకులాడగా ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ చివరకు అనంతాళ్వాన్ తోట వద్ద అదృశ్యమయ్యాడు.
తెల్లవారిన తరువాత ఆలయంలో స్వామివారి వక్ష:స్థల మహాలక్ష్మి కనిపించలేదు. స్వామి ఆజ్ఞానుసారం అర్చకులు ఛత్రచామర మంగళవాద్యాలతో అనంతాళ్వాన్ తోటకు వెళ్లారు.
జరిగిన విషయాన్ని ఆయనకు తెలియజేశారు. వెంటనే అనంతాళ్వాన్ చెట్టుకు కట్టేసిన అమ్మవారికి నమస్కరిస్తూ క్షమించాలని వేడుకున్నాడు. వెంటనే అమ్మవారిని పూలగంపలో పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి స్వామివారికి సమర్పించాడు. పూలగంపలో పెళ్లికుమార్తెలా కూర్చున్న అలమేలుమంగమ్మ ఆలయంలోకి వెళ్లిన తరువాత పూలబుట్టలో అదృశ్యమై శ్రీనివాసుని హృదయం మీద ప్రత్యక్షమైంది.
వెంటనే శ్రీనివాసుడు ”మామా, అనంతార్యా నీ కూతురు అయిన వ్యూహలక్ష్మిని నాకు సమర్పించిన కన్యాదాతవు, నీవు నాకు కన్యాదానం చేసిన మామగారివి. ఈ గాథ ఆ చంద్ర తారార్కం నిలిచివుండుగా” అని వరమిచ్చాడు.
పూలతోటలో అమ్మవారిని పూలచెట్టుకు కట్టేసిన దివ్యగాథకు గుర్తుగా నేటికీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం, ధ్వజావరోహణం మరునాడు శ్రీస్వామివారు అప్రదక్షిణంగా ఊరేగుతూ అనంతాళ్వారుల తోటకు వేంచేస్తారు.