ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభపరిణామమని అన్నారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే కొద్ది రోజుల క్రితం సుగాలి ప్రీతి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ కర్నూల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే తాజాగా నిన్న కర్నూల్ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ను సుగాలి ప్రీతి బంధువులు కలిశారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను ఉరితీయాలని కోరారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం వారి కుటుంబానికి ఊరట కలిగించే అంశమని, కానీ నిందితులకు శిక్ష పడినప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుందని పవన్ అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాసంఘాలకు పవన్ అభినందనలు తెలియచేశారు.