Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా జెండా పాతాలని కంకణం కట్టుకున్న బీజేపీకి ఏపీ మాత్రం మింగుడుపడటం లేదు. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో కంటే చాలా తక్కువ అవకాశాలున్నాయని సీనియర్లు మొత్తుకుంటుంటే.. అమిత్ షా మాత్రం ఏకపక్షంగా సర్వేలు చేయిస్తూ గాల్లో తేలిపోతున్నారనే విమర్శ కూడా ఉంది. ఉత్తరాదిని సరిగ్గా అర్థం చేసుకున్న అమిత్ షా.. దక్షిణాది విషయంలో తడబడుతున్నారు. ఉత్తరాది సూత్రాలు దక్షిణాదికి కుదరవని వెంకయ్య ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.
అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ప్యాకేజీతో సరిపెట్టిన కమలనాథులు ఏ రకంగా రాష్ట్రంలో బలపడదామనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు సీట్లు తెచ్చుకున్న బీజేపీకి.. ఒంటరిగా పోటీచేసి డిపాజిట్లు కూడా రావని అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో క్యాడర్ ను బలోపేతం చేయకుండా.. ఢిల్లీలో మోడీని చూపిస్తే ఓట్లు పడతాయని పగటి కలలు కంటున్నారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు చంద్రబాబుకు అనుకూలుడని, ఆయన్న మార్చేసి సోము వీర్రాజును ఎక్కించాలని అమిత్ షా కలగన్నారు. కానీ వెంకయ్య ప్రభావంతో అది సాధ్యం కాలేదన్నది కాషాయ వర్గాల మాట. నమ్మకమైన మిత్రుల్ని దూరం చేసుకోవడం మంచిది కాదని ఆరెస్సెస్ కూడా హితవు చెబుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈసారి కూడా చంద్రబాబు సూచనల మేరకే ఏపీలో నడుచుకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు నిరాశపడుతున్నారు. పైగా వారు పరిశీలిస్తున్న సోము వీర్రాజు కానీ, కన్నా లక్ష్మీ నారాయణ కానీ.. ఛరిష్మాలో చంద్రబాబుకు సాటివచ్చేవారు కాదని, అసలు జగన్ వర్సెస్ బాబు పోటీలో మరొకరు నెగ్గుకురాలేరని క్షేత్రస్థాయి వాస్తవాల్ని గ్రహించిన విశ్లేషకుల మాట.