సమ్మర్ హోమ్‌వర్క్ ఎందుకు చేయలేదని ప్రశ్నించినందుకు ఓ టీచర్‌ను.. విద్యార్థి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన హర్యానా సోనిపేట్‌లోని భిగన్ గ్రామంలోని శ్రీరామ్ కృష్ణ స్కూల్‌లో సోమవారం చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం హర్యానాలో సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. శ్రీరామ్ కృష్ణ స్కూల్‌లో పని చేస్తున్న ఇంగ్లీష్ టీచర్ ముకేశ్ కుమారి(45).. నిన్న ఉదయం పదకొండో తరగతిలోకి వెళ్లి సమ్మర్ హోమ్‌వర్క్ చేశారా? అని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి.. టీచర్‌ను పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయేందుకు ప్రయత్నించగా మరో టీచర్ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.