సూపర్‌స్టార్ రజనీకాంత్ (66) రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న ఊగిసలాటకి ఎట్టకేలకి తలైవా తెరదించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు.
‘‘మేము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తాం. నీతి నిజాయితీ, పారదర్శకత, అవినీతిరహిత రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తాం. ఈసారి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి’’అని రజనీ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరగకపోతే ఎప్పటికీ జరగదు, మేము మారుస్తాం. మేము అన్నింటినీ మారుస్తాం అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జత చేరుస్తూ రజనీ తన రాజకీయ అరంగేట్రం ప్రకటన చేశారు. రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ స్పష్టతనివ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చెన్నై కోడంబాక్కంలో శ్రీరాఘవేంద్రస్వామి కల్యాణమండపం వద్ద బాణా సంచా కాల్చారు. నగర వీధుల్లో తిరుగుతూ లడ్డూలు పంచిపెట్టారు.
సోషల్ మీడియాలో రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేశాక రజనీకాంత్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల తలరాత మార్చడం ఎంతో అవసరమన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ అది సాధ్యం కాదని, తమిళ ప్రజల కోసం తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా తన పొలిటికల్ ఎంట్రీ కాస్త ఆలస్యమైందన్నారు. రాజకీయాల్లో విజయం సాధించడమంటే అది ప్రజా విజయమేనన్న రజనీ ‘‘నేను ఎన్నికల్లో గెలిస్తే అది ప్రజా విజయం, ఒకవేళ నేను ఓడిపోతే కూడా అది వాళ్ల పరాజయమే.
నా గెలుపు మీ గెలుపు ఎలాగో, నా ఓటమి మీ ఓటమి కూడా. అంతా మీ చేతుల్లోనే ఉంది’’అని వ్యాఖ్యానించారు. గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ పేరిట రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవడంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు.