అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు

ఇటీవల భారత సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న పాక్ ప్రేరేపిత టెర్రరిస్టు గ్రూపులు ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతున్నాయని తెలుస్తోంది. అదను చూసి దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇటీవల అయోధ్యలోని రామజన్మభూమికి సంబంధించి వచ్చిన సుప్రీంకోర్టు తీర్పువారిలో తీవ్రఆగ్రహం కలిగిస్తోందని సమాచారం.

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా.. నాలుగు నెలల్లోనే రామ మందిరాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ లో దాడులు చేయాలని సోషల్ యాప్ టెలిగ్రామ్ ద్వారా ఉగ్రవాదులను అజార్ కోరిన ఓ వీడియో ఇటీవలే బయటకొచ్చింది.

అయోధ్య అంతటా దాడులు చేయాలని జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్ పిలుపునిచ్చాడని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. అందుకే అయోధ్యపై దాడి జరగొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయోధ్యలో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో భారత్- నేపాల్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడినట్లు సమాచారం అందింది.

అందుకే అప్పటి నుంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ , అయోధ్య నగరాల్లో తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. గత నెలలో అయోధ్య విషయంలో భారతదేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. సుప్రీం నిర్ణయం కోసం దేశం యావత్తు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూడగా తనదైన తీర్పుతో సమస్యకు పరిష్కారం చూపింది.